Big Breaking : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సమావేశంలో కీలక నిర్ణయాలను తీసుకున్నారు.పలు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ స్థానంలో మరోస్కీం, అమ్మఒడి అమలు తేదీ ఖరారు, స్మార్ట్ మీటర్లు వంటి వాటిపై చర్చించారు. అనంతరం వాటికి ఆమోదముద్ర వేశారు. సీఎం జగన్ మంత్రివర్గ భేటీ తరువాత ముందస్తు ఎన్నికలపై ప్రకటన చేస్తారని ప్రచారం జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రధానంగా ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పథకం గురించి చర్చించారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న దృష్ట్యా 28న తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు వేయాలని నిర్ణయించారు. దీంతో నాలుగేళ్లపాటు నిర్విరామంగా అమ్మఒడి అమలుచేసిన ఘనత వైసీపీ సర్కారుకు దక్కుతుందని అభిప్రాయపడ్డారు. విద్యాకానుక పథకాన్ని అమలుచేసేందుకు కూడా ఆమోదించారు. ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై కీలక నిర్ణయం తీసుకోగా అందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 జూన్ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులకు ఈ క్రమబద్దీకరణ వర్తించనుంది. ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఎంవోయూలు చేసుకున్న కొన్ని సంస్థలకు భూ కేటాయింపుకు ఆమోదం తెలిపింది.
ఏపీ గ్యారెంటెడ్ పెన్షన్ బిల్లు 2023 పేరుతో కొత్త పెన్షన్ విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. సిపిఎస్ ఉద్యోగుల కోసం సీపీఎస్ ఏపీ జిపిఎస్ బిల్లును తీసుకురానుంది. అలాగే 12వ పీఆర్సీ ఏర్పాటుకు కేబినెట్ అంగీకారం తెలిపింది. వీటితో పాటు 18.58 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్ల బిగింపుకు 6,888 కోట్ల వ్యయం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్ నెట్ కోసం రూ.445 కోట్ల రుణాల కోసం ఏపీఎఫ్ఎస్ఎల్ కు కేబినెట్ అనుమతి ఇచ్చింది.