Bhumana Comments on IAS Sri Lakshmi: రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓబులాపురం మైనింగ్ కుంభకోణం ప్రధానంగా వెలుగులోకి వచ్చింది.. అప్పట్లో గాలి జనార్దన్ రెడ్డి కోసం విలువైన సున్నపురాయి నిక్షేపాలను.. ఇతర వనరులను అడ్డగోలుగా కట్టబెట్టారని ఆరోపణలు వినిపించాయి. ఈ వ్యవహారంలో అప్పట్లో ఐఏఎస్ అధికారిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మి కీలకంగా పని చేశారని విమర్శలు వినిపించాయి. ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి పై రకరకాల కథనాలు మీడియాలో వచ్చాయి. ఆమె జైలు శిక్ష కూడా అనుభవించారు. కొంతకాలం వరకు శ్రీలక్ష్మి బయటికి రాలేదు. అనంతరం జగన్ అధికారంలోకి తర్వాత శ్రీలక్ష్మికి కీలక హోదా లభించింది. ఒకరకంగా శ్రీలక్ష్మి మీద వచ్చిన ఆరోపణలకు వైసీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చేవారు. వైసిపి మౌత్ పీస్ సాక్షి కూడా శ్రీలక్ష్మిని నిరపరాధిగా పేర్కొంటూ కథనాలను ప్రచురించేది.
శ్రీ లక్ష్మీ విషయంలో స్టాండ్ మారిందా
తెర వెనుక ఏం జరిగిందో తెలియదు గానీ శ్రీ లక్ష్మీ విషయంలో వైసిపి స్టాండ్ మారినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే తాడేపల్లి నుంచి ఆదేశాలు రాకుండా వైసిపి నేతలు అందులోనూ కీలక స్థానంలో ఉన్న నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడరు. అందులోనూ కీలక విషయాల గురించి అసలు మాట్లాడరు.. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నట్టుండి సంచలన ఆరోపణలు చేశారు. అది కూడా ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మీద..” ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి అవినీతిలో అనకొండ. ఆమె రోజుకు 1.5 లక్షల విలువైన చీర కడతారు. వేల రూపాయలు విలువ చేసే 11 విగ్గులు ఆమె వద్ద ఉన్నాయి” ఇలా సాగిపోయింది కరుణాకర్ రెడ్డి విమర్శలపర్వం. ఉన్నట్టుండి శ్రీలక్ష్మి మీద ఆయన ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి.. ఈ స్థాయిలో విరుచుకుపడడానికి తెర వెనుక ఏం జరిగిందనేది అంతుపట్టకుండా ఉంది.
అదే కారణమా
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి కేటాయించిన విలువైన వనరుల విషయంలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూ వస్తోంది. అప్పట్లో ఓబులాపురం ప్రాంతంలో టిడిపి నేతలు పర్యటించారు. అక్కడ కూల్చేసిన గుడి.. ఇతర హద్దులను చూసి అవాక్కయ్యారు. దానిపై కోర్టుకు పలు నివేదికలు కూడా సమర్పించారు. ఇప్పుడు ఈ కేసును మళ్లీ తిరగతోడే ప్రయత్నం మొదలైందని తెలుస్తోంది. ఇదే కేసులో ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో అభియోగాలు ఎదుర్కొన్నారు. చివరికి కోర్టు కూడా ఆయనకు శిక్ష విధించింది. తనకున్న పలుకుబడితో ఆయన బెయిల్ సంపాదించుకున్నారు. అయితే ఈ కేసులో జగన్ ను అడ్డంగా ఇరికించాలని.. దానికి తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించాలని టిడిపి భావించినట్టు తెలుస్తోంది. నాటి ఈ వ్యవహారంలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించిన నేపథ్యంలో.. ఆమె ఇచ్చిన వివరాల ద్వారా ఈ కేసులో మరిన్ని నిజాలు రాబట్టాలని తెలుగుదేశం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రీలక్ష్మి కూడా దానికి సుముఖంగా ఉన్న నేపథ్యంలోనే.. వైసిపి ఎదురుదాడికి దిగినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డి ద్వారా ఆరోపణలు చేయించినట్టు సమాచారం.