https://oktelugu.com/

Bhuma Akhila Priya : అఖిలమ్మా.. ఆ వీధి పోరాటాలేంటమ్మా

దూకుడు స్వభావంతో అందర్నీ దూరం చేసుకుంటున్నారన్న అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు. ఏవీ సుబ్బారెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు వియ్యంకుడు. పైగా సీనియర్ నాయకుడు. పార్టీ శ్రేణులు కూడా ఆయన వైపే మొగ్గుచూపుతున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : May 17, 2023 10:44 am
    Follow us on

    Bhuma Akhila Priya : భూమా అఖిలప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ అనుచరులు దాడి చేయడమే ఇందుకు కారణం. ఆ సమయంలో అఖిలప్రియ అక్కడే ఉండడంతో..ఆమె ప్రోత్సాహంతోనే దాడి జరిగిందని ఏవీ సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు భూమా అఖిల ప్రియతో పాటు మరికొందరిపై హత్యయత్నం కేసులు పెట్టారు. అఖిలప్రియతో పాటు మిగతా వారిని అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలో ముగిసింది. మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించగా.. లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు కొత్తపల్లి దగ్గర భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది.

    నంద్యాల టీడీపీలో ఎప్పటి నుంచో వర్గ విభేదాలు నడుస్తున్నాయి. భూమా అఖిలప్రియ, సుబ్బారెడ్డిల మధ్య ఫైట్ పతాక స్థాయిలో సాగుతోంది. గత ఎన్నికల ముందు కూడా సుబ్బారెడ్డిపై రాళ్ల దాడి జరిగింది. మూడేళ్ల కిందట ఏకంగా హత్యకు కుట్ర జరిగింది. దీనిని పోలీసులు భగ్నం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నాయి. అయితే దీని వెనుక మాజీ మంత్రి అఖిల ప్రియ హస్తం ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఆమె సుఫారీ ఇచ్చి హత్యకు ప్రోత్సహించారన్న ఆరోపణలు వచ్చాయి. కానీ గత కొంతకాలంగా రెండు వర్గాలు సైలెంట్ గా ఉన్నాయి. లోకేష్ పాదయాత్రలో బలం నిరూపించే క్రమంలో సుబ్బారెడ్డిపై దాడి జరగడం తో టీడీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

    వాస్తవానికి ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి ప్రాణ స్నేహితులు. భూమా నాగిరెడ్డి మరణం తర్వాత వీరి మధ్య విబేధాలు మొదలయ్యాయి. ఏవీ కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు.. నంద్యాల, ఆళ్లగడ్డలో ఏదో ఒక చోట నుంచి తనకు అవకాశం ఇవ్వాలని గతంలోనే కోరారు. అప్పటి నుంచి అఖిలప్రియతో విభేదాలు పెరిగాయి. ఏవీ సుబ్బారెడ్డి కూడా కొంతకాలంగా దూకుడు పెంచారు.. లోకేష్ పాదయాత్ర ద్వారా తన బలాన్ని నిరూపించుకోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఈ దాడి జరిగిందనే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సుబ్బారెడ్డి టిక్కెట్ కు బలంగా ప్రయత్నిస్తుండడంతో అఖిల ప్రియకు మింగుడు పడడం లేదు. ఈ క్రమంలోనే దాడి జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

    భూమా కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు అఖిలప్రియ. అయితే దూకుడు స్వభావంతో అందర్నీ దూరం చేసుకుంటున్నారన్న అపఖ్యాతిని మూటగట్టుకుంటున్నారు. ఏవీ సుబ్బారెడ్డి టీడీపీ సీనియర్ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావు వియ్యంకుడు. పైగా సీనియర్ నాయకుడు. పార్టీ శ్రేణులు కూడా ఆయన వైపే మొగ్గుచూపుతున్నాయి. ఇటువంటి తరుణంలో అఖిలప్రియ దగ్గరుండి దాడి చేయించడాన్ని హైకమాండ్ సీరియస్ గా తీసుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి అఖిల ప్రియ ఎంత వేగంగా రాజకీయంగా ఎదిగారో.. అంతే స్పీడుతో తన కెరీర్ ను పాడుచేసుకుంటున్నారన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి.