NTR Centenary Celebrations: ఒకే వేదికపైకి అన్నగారి కుటుంబం.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

శత జయంతి వేడుకలు కావడంతో ప్రతిఒక్కరూ హాజరయ్యేందుకు మొగ్గుచూపుతున్నారు. జూనియర్ ఎన్టీయార్ తో పాటు హరిక్రిష్ణ మరో కుమారుడు అయిన కళ్యాణ్ రామ్ కి కూడా ఇన్విటేషన్స్ పంపారు.

Written By: Dharma, Updated On : May 17, 2023 10:34 am
Follow us on

NTR Centenary Celebrations : దగ్గుబాటి ఫ్యామిలీ టీడీపీకి దగ్గరవుతోందా? ఇందుకు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు వారధిగా నిలవనున్నాయా? పురందేశ్వరి తెలుగుదేశం పార్టీ తరుపున ఎంపీగా పోటీచేయనున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇవే చర్చనీయాంశమయ్యాయి. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వెన్నంటి నడిచారు. అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు టీడీపీ అభ్యర్థిపై ఓటమి చవిచూశారు. అనంతరం టీడీపీ గూటికి చేరారు. పార్టీపై పట్టు సాధించారు.అప్పటి నుంచి తోడల్లుళ్లు రెండు వర్గాలు నడిపారు. కానీ ఎన్టీఆర్ ను గద్దె దించడం ఎపిసోడ్ లో చేతులు కలిపారు. పార్టీని, ప్రభుత్వాన్ని చంద్రబాబు టేకోవర్ చేసుకున్నారు. దగ్గుబాటికి ప్రాధాన్యం లేకుండా చేశారు. దీంతో మనస్తాపంతో దగ్గుబాటి పార్టీని వీడారు. అది దరిమిళా ఇప్పటివరకూ చంద్రబాబు చెంతకు చేరలేదు.

అయితే ఇటీవల తోడల్లుళ్లు ఇద్దరి మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. సానుకూల వాతావరణం ఏర్పడింది. అది రాజకీయ మైత్రికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మరణానంతరం దగ్గుబాటి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన భార్య పురందేశ్వరి సైతం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రెండుసార్లు ఎంపీగా గెలుపొంది. కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టారు. విభజన అనంతరం కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. అయితే బీజేపీ ఏపీలో అంత ప్రభావం చూపకపోడంతో పురందేశ్వరికి పదవులు దక్కడంలేదు. దీంతో ఆమె పునరాలోచనలో పడ్డారు. అటు చంద్రబాబు నుంచి సానుకూలత రావడంతో అటువైపుగా చూడడం ప్రారంభించారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విజయవాడలో వేడుకలు పూర్తయ్యాయి. ఈ నెల 20న హైదరాబాద్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమానికి దగ్గుబాటి దంపతులకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు టీడీ జనార్దన్ ఆహ్వానాన్ని అందించారు. కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతామని పురందేశ్వరి దంపతులు సానుకూలత చూపారు.
దీంతో ఒకే వేదిక మీద దగ్గుబాటి చంద్రబాబులను చూడవచ్చు. అంతే కాదు రానున్న రోజులలో టీడీపీలో దగ్గుబాటి ఫ్యామిలీ చేరికకు అన్న గారి జయంతి వేడుక వారధి అవుతుందని కూడా అంటున్నారు.

నందమూరి కుటుంబం మొత్తం ఒకే వేదికపై రానుంది. కుటుంబానికి చెందిన ప్రతిఒక్కరికీ ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. శత జయంతి వేడుకలు కావడంతో ప్రతిఒక్కరూ హాజరయ్యేందుకు మొగ్గుచూపుతున్నారు. జూనియర్ ఎన్టీయార్ తో పాటు హరిక్రిష్ణ మరో కుమారుడు అయిన కళ్యాణ్ రామ్ కి కూడా ఇన్విటేషన్స్ పంపారు. జూనియర్ రాకపోయినా కళ్యాణ్ రామ్ తప్పకుండా హాజరవుతారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రొగ్రామ్స్ ముందుగానే ఫిక్స్ కావడంతో ఆయన రావడం డౌటే. అయితే నందమూరి కుటుంబం ఒకే వేదికపై వచ్చిన తరువాత తారక్ కూడా కలవాల్సిన అనివార్య పరిస్థితి ఉంటుంది. మొత్తానికి చంద్రబాబు పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నట్టు అవగతమవుతోంది.