AP BJP: ఆ ఆలోచనలో బిజెపి

రాయలసీమకు చెందిన వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. పురందేశ్వరి దగ్గరుండి ఆయనను తీసుకెళ్లారు. కాపు రామచంద్రారెడ్డి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు.

Written By: Dharma, Updated On : February 29, 2024 6:19 pm
Follow us on

AP BJP: ఏపీలో భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. పొత్తుతో అయితే ఒక లెక్క.. ఒంటరిగా పోటీ చేస్తే మరో లెక్క అన్నట్టు ఆ పార్టీ వ్యూహం ఉంది. ముఖ్యంగా టిడిపి, జనసేన, వైసీపీ ల నుంచి భారీ స్థాయిలో నాయకులను చేర్చుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతానికైతే వైసీపీపై ఫోకస్ పెట్టింది. ఆ పార్టీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతుండడంతో అసంతృప్తులు భారీగా ఉన్నారు . కానీ తెలుగుదేశం, జనసేనలో వారికి చాన్స్ లేదు. పొత్తులో భాగంగా రెండు పార్టీలు సైతం సీట్లు కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో చాలామంది వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు గుంభనంగా ఉంటున్నారు. అటువంటివారు బిజెపి టచ్ లోకి వస్తున్నారు. అయితే ఒకవేళ పొత్తు లేకుంటే మాత్రం.. టిడిపి, జనసేన అసంతృప్త నేతలు సైతం బిజెపి వైపు వచ్చే అవకాశం ఉంది. తద్వారా బలపడాలని బిజెపి స్కెచ్ వేసింది.

రాయలసీమకు చెందిన వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిశారు. పురందేశ్వరి దగ్గరుండి ఆయనను తీసుకెళ్లారు. కాపు రామచంద్రారెడ్డి తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. టికెట్ కేటాయిస్తే బిజెపిలో చేరతానని ప్రతిపాదించారు. అయితే ఒక కాపు రామచంద్రారెడ్డి కాదు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు, ఎంపీ అభ్యర్థి ఒకరు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఐదుగురు వరకు బిజెపికి టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ పొత్తులో భాగంగా బిజెపికి ఎక్కువ సీట్లు లభిస్తే.. ఆ పార్టీ తరపున వీరు పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పటికే బీజేపీ నేతలు ఆశావహులుగా ఉన్నారు. అందుకే బిజెపి నాయకత్వం ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది.

బిజెపి కేంద్ర నాయకత్వం ఒంటరి పోరుకు సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ జాతీయస్థాయిలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పొత్తుకు అంగీకరించినా.. మెజారిటీ సీట్లు దక్కించుకునేందుకు బిజెపి ప్రయత్నిస్తుంది. అదే జరిగితే బిజెపికి బలమైన అభ్యర్థులు అవసరం. అందుకే అప్పుడు సిట్టింగులు అక్కరకు వస్తారని.. వారైతే బలమైన అభ్యర్థులు అవుతారని.. ఎలక్షన్ క్యాంపెయిన్ చేయగలరని బిజెపి భావిస్తోంది. అందుకే వారిని తన లైన్లోకి తీసుకుంది. ఒకవేళ పొత్తు లేకుంటే మాత్రం.. 40 నుంచి 50 సీట్లలో బలమైన అభ్యర్థులను బరిలో దించేందుకు యోచిస్తోంది. అప్పుడు ఒక్క వైసీపీ కాదు.. టిడిపి, జనసేన ల నుంచి బలమైన నేతలు బిజెపిలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే రెండు రకాల వ్యూహాలతో బిజెపి ముందుకెళ్తోంది. పొత్తు ఉంటే ఒకలా.. లేకుంటే మాత్రం మరోలా ముందుకు సాగాలన్నది బిజెపి వ్యూహం. మరి ఎన్నికల ముంగిట ఎలాంటి వ్యూహం అవసరం అవుతుందో చూడాలి.