Amaravati And YCP: వ్యక్తులైన, వ్యవస్థలైన తప్పు చేయడం అనేది సహజం. తప్పిదాలు జరగడం సర్వసాధారణం కూడా. తప్పు చేయని వ్యక్తి ఉండరు. తప్పు జరిగిన వ్యవస్థ ఉండదు. తప్పు అని తెలిస్తే సరిదిద్దుకోవాలి. దాని జోలికి పోకూడదు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ అదే పని చేయాలి. ఒకసారి అమరావతి రాజధాని జోలికి వెళ్లి చేతులు కాల్చుకుంది వైసిపి. మరోసారి దాని జోలికి వెళ్లక పోవడమే ఉత్తమం. అలా వెళ్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ నష్టం చేసింది అమరావతి రాజధాని అంశమే. అమరావతిని నిర్వీర్యం చేయడం ఒక తప్పు. మూడు రాజధానుల అంశాన్ని అందుకోవడం రెండో తప్పు. దానిని అమలు చేయకపోవడం ఇంకో తప్పు. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల పోరాటానికి అడ్డంకుల సృష్టించడం చివరి తప్పు. వీటన్నింటినీ గమనించిన ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా ఓడించారు. అయినా ఆ పార్టీ గుణపాఠాలు నేర్చుకునే పరిస్థితిలో లేదు. ఇప్పుడు కూడా అమరావతి పై ఏ చిన్న రకం వ్యతిరేక ప్రచారం వస్తున్న దానిని హైలెట్ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ముమ్మాటికి అది తప్పిదం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోసారి ఇలానే కొనసాగితే మరింత ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
* మూడు రాజధానుల విషయంలో ఫెయిల్..
అమరావతిని( Amravati capital ) వద్దనుకున్నారు సరే. కనీసం మూడు రాజధానులను ముందుకు తీసుకెళ్లగలిగారా అంటే అదీ లేదు. ఆ ప్రయత్నంలో విఫలమయ్యేరే తప్ప సఫలం కాలేదు. రాష్ట్ర ప్రజలు కూడా హర్షించలేదు అప్రయత్నాన్ని. అటువంటిప్పుడు దానిని ఒక విఫల ప్రయత్నం గా చూడాలి తప్ప.. అదే పనిగా వ్యతిరేక ప్రచారం చేయడం అనేది ముమ్మాటికి తప్పిదమే. కూటమి అధికారంలోకి వచ్చింది. అమరావతి రాజధాని నిర్మాణ పనులను మొదలుపెట్టింది. అయితే వరద ప్రాంతంలో కట్టారని ఒకరు.. మునిగిపోయే ప్రాంతంలో కడుతున్నారని ఇంకొకరు ఇలా లేనిపోని ప్రచారం చేస్తూనే ఉన్నారు. సాక్షి మీడియాతో పాటు వైసిపి అనుకూల సోషల్ మీడియాలో ఈ ప్రచారం ఎక్కువగా జరిగింది. ఫలితంగా ఇప్పటికీ అమరావతిపై వైసీపీ కుట్రలు చేస్తూనే ఉందన్న అనుమానాలు ప్రజల్లో మరింత బలపడుతున్నాయి. అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం.
* కేంద్రం సైతం సానుకూలం..
ఒకవైపు అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దానికి చట్టబద్ధత కల్పించే పనిలో ఉంది ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం( central government) సైతం సానుకూలంగా ఉంది. అమరావతి రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తోంది. ఇటువంటి సమయంలో ప్రతికూల ప్రచారం అంటే అది ప్రజల్లో మైనస్ గా ఉంటుంది. అది వైసీపీ అభిప్రాయం కంటే కుట్ర అని ఎక్కువమంది డిసైడ్ అవుతారు. ఇప్పటికే అమరావతి విషయంలో వైసీపీకి భారీగా డ్యామేజ్ జరిగింది. కేవలం చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందన్న నెపంతోనే అమరావతిని నిర్వీర్యం చేశారన్న అభిప్రాయం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి తప్ప.. అనవసరంగా అమరావతిని కెలుకుతూ తన మీదకు తెచ్చుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. గుణపాఠాలు నేర్చుకోకుంటే మాత్రం ఆ పార్టీకి ఇబ్బందికరమే. ఇకనుంచి అమరావతి అనే అంశాన్ని విడిచి పెట్టాలని వైసిపి అనుకూల విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల విజ్ఞతకే దానిని విడిచిపెడదాం.