Begging Banned In AP: ఏపీ ప్రభుత్వం( AP government) మరో ప్రతిష్టాత్మక జీవోను జారీ చేసింది. రాష్ట్రంలో భిక్షాటనను నిషేధించింది. ఇకనుంచి వారిని ప్రోత్సహించడం.. వారికి నగదు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఇప్పటికే పేరు మోసిన నగరాల్లో బిచ్చగాళ్ళ నిషేధం కొనసాగుతోంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. మొన్న ఆ మధ్యన విశాఖ నగరంలో బిచ్చగాళ్లను ప్రత్యేక వాహనంలో ఎక్కించి.. వారి స్వస్థలాలకు పంపించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, నా అన్నవారు లేని వారిని అనాధ శరణాలయాలకు పంపించారు. అయితే ఇప్పుడు ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా బిచ్చగాళ్లపై నిషేధం విధించడం సహస చర్య. సాధారణంగా నగరాల్లో వ్యవస్థీకృత భిక్షాటన జరుగుతోందని ఫిర్యాదులు ఉన్నాయి. ఆపై రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు బిఫోర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. విశాఖ వంటి నగరాలకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలో భిక్షాటన చేస్తూ బిచ్చగాళ్లు కనిపిస్తే.. ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం బిచ్చగాళ్లపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
Also Read: సెంచరీ కొట్టినా నో సెలబ్రేషన్స్.. గెలిచేదాకా పోరాటం.. జెమీమా పట్టుదలకు సలాం
* ముఖ్యంగా నగరాల్లో, దేవస్థానాల్లో
సాధారణంగా విశాఖ( Visakhapatnam), విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో.. ప్రధాన కూడళ్ళలో బిచ్చగాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. ఆపై ప్రముఖ దేవస్థానాలు, ఆలయాలు చెంతనే భిక్షాటన చేస్తుంటారు. అయితే విదేశీ పెట్టుబడులు పెద్ద ఎత్తున ఏపీకి వస్తున్నాయి. బిచ్చగాళ్లను చూస్తే ఆర్థికంగా ఇంకా రాష్ట్రం అభివృద్ధి చెందాలేదన్న అభిప్రాయానికి పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక ప్రతినిధులు వస్తారు. అందుకే ముందుగా ప్రముఖ నగరాలతో పాటు దేవస్థానాల వద్ద భిక్షాటనను నిషేధించారు. ఈ భిక్షాటన విషయంలో సైతం మాఫియా నడుస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నా అనే వారిని టార్గెట్ చేసి.. భిక్షాటన మగ్గులోకి దించి కొందరు లాభపడుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. వ్యవస్థీకృత బిక్షాటన విస్తృతం అవుతున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకనుంచి బిచ్చగాళ్లకు నగదు, ఇతరత్రా వస్తువులు ఇవ్వడం చేయకూడదట.
* P 4లో భాగంగా..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పి4( P4) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బంగారు కుటుంబాలు- మార్గదర్శులు పేరిట ఈ కార్యక్రమం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్థికంగా అట్టడుగున వర్గాలకు.. ఆర్థికంగా వృద్ధి చెందినవారు దత్తత తీసుకోవడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా.. సాయం చేసే వారిని మార్గదర్శకులుగా చూపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. సమాజంలో సంపన్న వర్గాలు పేదలకు దత్తత తీసుకోవడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. అందుకే బిచ్చగాళ్లను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడం, ఉచితంగా రేషన్ అందించడం, పి 4 కార్యక్రమంలో భాగంగా వచ్చిన విరాళాలతో వారిని వృద్ధిలోకి తేవడం అన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. అయితే బిక్షాటనకు అలవాటు పడినవారు.. దాని నుంచి బయట పడడం అంత ఈజీ కాదు. మరి దీన్ని ప్రభుత్వం ఎలా డీల్ చేస్తుందో చూడాలి.