Bear create rucks: సాధారణంగా వన్యప్రాణులు జనారణ్యంలోకి రావు. కానీ మానవ తప్పిదాల వల్లే అవి గ్రామాల వైపు వస్తున్నాయి. ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ప్రజల నుంచి హాని ఉంటుందని భయపడి ఎదురుదాడికి దిగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఏనుగుల సంచారం ఉంది. కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఎలుగుబంట్ల స్వైర విహారం అధికంగా ఉంది. ప్రధానంగా ఉద్దానం ప్రాంతంలో అవి సృష్టిస్తున్న భయానకం అంతా ఇంత కాదు. వాటి బారిన పడి ప్రతి సంవత్సరం ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. మరెందరో గాయాల పాలవుతున్నారు. అయితే అడవులు అంతరించిపోతుండడంతోనే అవి స్వైర విహారానికి దిగుతున్నాయి. గ్రామాలపై వచ్చి పడుతున్నాయి.
ఎలుగుబంటి హల్ చల్..
తాజాగా మందస మండలం అంబుగాం బొడ్డులూరు గ్రామంలో ఓ ఎలుగు హల్చల్ చేసింది. ప్రస్తుతం వినాయక నవరాత్రి వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోజంతా భజనలు, పూజా కార్యక్రమాలతో ప్రజలు బిజీగా ఉంటున్నారు. సందడి సందడిగా గ్రామాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఓ ఎలుగుబంటి వినాయక మండపానికి దగ్గరగా వచ్చింది. ఒకేసారి గ్రామం మధ్యలోకి రావడంతో గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఎలుగుబంటి ఇలా వచ్చిందో లేదో కుక్కలు అరవడం ప్రారంభించాయి. కానీ ఆ భల్లూకం ఎవరికి హాని తలపెట్టలేదు. కొద్దిసేపు అటూ ఇటూ తిరుగుతూ సమీప తోటల్లోకి వెళ్లిపోయింది.
అడవుల కనుమరుగు..
గత కొద్ది రోజులుగా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తున్నాయి. తీర ప్రాంతం తో పాటు తోటల్లో తరచూ కనిపిస్తున్నాయి. అయితే శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కనుమల్లో భాగంగా మహేంద్రగిరి లు ఉన్నాయి. వాటిని అనుసరించి దండకారణ్యం ఉంది. సరిహద్దు ప్రాంతం కావడంతో ఒడిస్సా రాష్ట్రం పర్యాటకంగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలో అక్కడ ఉండే అడవులు ఆక్రమణల బారిన పడుతున్నాయి. కలప అక్రమార్కులు, వన్యప్రాణుల వేట, మద్యం తయారీ, గంజాయి సాగు వంటి కారణాలతో అడవులు కనుమరుగవుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు అక్కడ తలదాచుకుంటున్న వన్యప్రాణులు మైదాన ప్రాంతాలకు వస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్లు, అలుగులు, నెమళ్లు ఇప్పుడు గ్రామాల్లో కనిపించడం సర్వసాధారణం అయిపోయింది. అయితే ఇందులో మనుషులకు హాని కలిగించే జంతువులు చేరుతుండడంతో.. ప్రజలు భయపడుతున్నారు.