Bay of Bengal weather warning : ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారు 16 సంవత్సరాల తరువాత తొలిసారిగా అతివేగంగా నైరుతి రుతుపవనాలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి.ఏపీకి అయితే 8 రోజులు ముందుగానే తాకాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించాయి. ముందుగా బంగాళాఖాతాన్ని( Bay of Bengal ) తాకాయి. తరువాత దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమోరిన్ రీజియన్, బంగాళాఖాతం దక్షిణ- మధ్య ప్రాంతం, ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతాల్లో చురుగ్గా కదులుతున్నాయి. వీటికి అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు ఏపీకి సంబంధించి ముందుగా రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. మిగతా ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.
Also Read : జగన్ అభిమాని అరగుండు..తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
ఒడిశా తీరంలో ఆవర్తనం..
ఒడిశా తీరం వెంబడి వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పారాదీప్ నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయి ఉంది. ఈరోజు అల్పపీడనంగా మారింది. దీని ప్రభావం ఏపీపై ఉంది. ఈరోజు కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైయస్సార్ కడప, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అదే స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలకు అసౌకర్యం తప్పడం లేదు.
అల్పపీడనాల సమయం..
సాధారణంగా జూన్,సెప్టెంబరు మధ్య ఎక్కువగా ఆల్పపీడనాలు ఏర్పడతాయి. ఆ సమయంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతాయి. అప్పుడే ఆవర్తనాలు, అల్పపీడనాలు ఏర్పడేందుకు అనుకూల సమయం. దేశంలో నైరుతి రుతుపవనాలు ప్రధానమైనవి. ఇవి ప్రవేశించినప్పుడే దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అత్యధిక వర్షపాతం ఇచ్చేవి నైరుతి రుతుపవనాలు. అటువంటి రుతుపవనాలు ఇప్పుడు చురుగ్గా కదులుతుండడంతో వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మున్ముందు మరిన్ని అల్పపీడనాలు, ఆవర్తనాలు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వర్షాలు పడుతుండడంతో ఏపీలో రైతులు ఖరీఫ్ పనులు ప్రారంభించారు. వరి ఆకు మడులు సిద్ధం చేస్తున్నారు.