Homeఆంధ్రప్రదేశ్‌Jagan: వైసీపీ శ్రేణులకు, అధినేతకు మధ్య అడ్డుగోడలు.. ఇలాగైతే కష్టం జగన్!

Jagan: వైసీపీ శ్రేణులకు, అధినేతకు మధ్య అడ్డుగోడలు.. ఇలాగైతే కష్టం జగన్!

Jagan: వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిలో( Jagan Mohan Reddy) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇకనుంచి మొహమాటలకు పోదలుచుకోలేదని.. పార్టీకి ఏది అవసరమో అటువంటి నిర్ణయాలే తీసుకుంటానని తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో కఠినంగా ఉంటానని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటీవల అయితే ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు ఒక ఎత్తు.. ఇకనుంచి మరో ఎత్తు అన్నట్టు ఉంటుంది పరిస్థితి అని తేల్చి చెప్పారు. జగన్ 1.0 ప్రజల కోసమని.. జగన్ 2.0 కార్యకర్తల కోసమేనని స్పష్టం చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డిలో ఈ తరహా మార్పును పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి. కానీ కార్యకర్తలకు అధినేతకు మధ్య ఉన్న అడ్డుగోడలు తొలగించాలని కోరుతున్నాయి. ముఖ్యంగా కోటరీ వ్యవస్థ ఉండకూడదని చెబుతున్నాయి. రీజినల్ కోఆర్డినేటర్లు, సలహాదారులు వంటివి పార్టీని మరింత ఇబ్బందుల్లో పెడుతున్నాయి అన్నది మెజారిటీ శ్రేణుల అభిప్రాయం. ఈ విషయంలో అధినేత తీరులో మార్పు రావాలని కోరుకుంటున్నాయి.

* రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ
ఏ పార్టీలో లేని విధంగా రీజనల్ కోఆర్డినేటర్( regional coordinator ) వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అత్యంత విధేయులకు ఆ పదవి కట్టబెట్టి బాధ్యతలు అప్పగించారు. అయితే కొంతవరకు వారి ద్వారా పార్టీ బలోపేతం అయింది. కానీ ఎక్కువ శాతం కోఆర్డినేటర్ల ద్వారా నష్టం జరిగిందనే వాదన ఉంది. పార్టీ బలోపేతం కోసం కోఆర్డినేటర్లు కష్టపడటం లేదన్న విమర్శ ఉంది. కొన్ని రకాల నివేదికలు, సర్వేలు మార్పు చేసి చెప్పడం ద్వారానే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని ఎక్కువమంది వాదిస్తున్నారు. అయితే మరి కొందరు కోఆర్డినేటర్లు సామంత రాజులుగా వ్యవహరించారని.. వారే షాడో సీఎంలు గా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే అటువంటి వ్యవస్థను తీసివేస్తే మంచిదన్న అభిప్రాయం ఉంది.

* ఆ నలుగురు చేతిలో సీఎంఓ
గత ఐదేళ్ల వైసిపి ( YSR Congress) పాలనలో ముఖ్యమంత్రి కార్యాలయం ఆ నలుగురి చేతిలో చిక్కిందన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం అధినేతను కలుసుకుందామంటే ఏడు ద్వారాలు దాటి వెళ్లాల్సి వచ్చేదని.. కనీసం అపాయింట్మెంట్ దొరికిన పాపాన పోలేదని సాక్షాత్ మంత్రి వ్యాఖ్యానించడం అప్పట్లో ఆందోళన కలిగించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి.. ఎన్నికలకు ముందు తన ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యేగా కంటే ఎంపీగా పోటీ చేయాలని ఉందని.. ఆ విషయాన్ని చెప్పేందుకు అధినేత తనకు అవకాశం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిలో తాజాగా మార్పు వచ్చింది కానీ.. ఇంకా అడ్డుగోడలుగా కోఆర్డినేటర్లు, సలహాదారులు కొనసాగడాన్ని మాత్రం ఎక్కువ మంది తప్పు పడుతున్నారు.

* ఉగాది నుంచి ప్రజల్లోకి..
ఉగాది ( Ugadi) నుంచి ప్రజల్లోకి వస్తాననుకుంటున్న జగన్మోహన్ రెడ్డి.. అంతకంటే ముందే తాను మారానన్న సంకేతాలు పార్టీ శ్రేణులకు పంపించాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికలకు ముందు 80 మంది అభ్యర్థులను మార్చారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ ప్రయోగం విఫలమయ్యింది. అందుకే ఆ పాత నేతలనంత తిరిగి నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ వినిపిస్తోంది. పార్టీ క్యాడర్ కూడా అదే కోరుకుంటుంది. ప్రయోగాలు విఫలమైనప్పుడు మళ్లీ యధా స్థానానికి ఆ నేతలను చేర్చడం ప్రధాన విధి. కానీ జగన్మోహన్ రెడ్డి కేవలం కొద్ది మందిని మాత్రమే ఆ విధంగా మార్చారు. ఇంకా చాలామంది నేతలు ఉన్నారు. వారందరినీ మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు. పార్టీ నిర్మాణం విషయంలో వారి అభిప్రాయాలను తీసుకొని.. వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అధినేత జగన్మోహన్ రెడ్డి పై ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular