Bandi Sanjay : బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఏపీ పాలిటిక్స్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టారు. ఆయనకు చాన్స్ దొరికితే చాలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. సీఎం జగన్ తో పాటు వైసిపి నాయకులపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బిజెపి సమావేశంలో వర్చువల్ విధానంలో మాట్లాడిన బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఏపీలో హిందూ మతం పై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న పరిణామాలు పై కూడా స్పందించారు. భక్తుల్లో అడుగడుగునా ఆందోళన సృష్టిస్తూ తిరుమలకు భక్తులు రాకుండా అడ్డుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భక్తులను కాపాడలేక కర్రలు ఇస్తారా? వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. గత కొద్దిరోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూ జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసిందే. వన్యప్రాణుల నుంచి భక్తులను కాపాడేందుకు టీటీడీ పటిష్ట చర్యలు తీసుకోవడం లేదన్న చర్చ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో బండి సంజయ్ వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.
అటు టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన భూమన కరుణాకర్ రెడ్డి ని సైతం బండి సంజయ్ విడిచిపెట్టలేదు ” కొత్తగా నియమితులైన టిటిడి చైర్మన్ ఎవరండీ? ఆయన బిడ్డ పెళ్లి క్రైస్తవ ఆచార పద్ధతిలో చేసిన మాట నిజం కాదా? నేను నాస్తికుడు అని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? ఇంకా సిగ్గు లేకుండా తిరుమల లో అడవులు ఉన్న విషయమే తెలియదని టీటీడీ చైర్మన్ చెబుతున్నారట. ఆయనకు పుష్ప సినిమా చూపించాలేమో? అంటూ బండి సంజయ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే కొత్తగా వైసిపి నేతలకు బిజెపి భయం పట్టుకుంది. ఎన్నికల సమీపించేసరికి బిజెపి తమపై దూకుడు పెంచుతుంది అన్న భయం వారిని వెంటాడుతోంది. ముఖ్యంగా బండి సంజయ్ ఏపీ బీజేపీ ఇన్చార్జిగా నియమితులవుతారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు చుక్కలు చూపించారు. విధానపరమైన విమర్శలు చేయడంలో సంజయ్ ముందుంటారు. ఇప్పుడు ఏపీలో ఆయన ఇన్చార్జిగా నియమితులైతే బిజెపి నుంచి విమర్శలు దాడి పెరిగే అవకాశం ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది.