Avanti Srinivas Rao : మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ( Avanti Srinivas Rao )టిడిపి హై కమాండ్ లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే అవంతి శ్రీనివాస్ గతంలో వ్యవహరించిన తీరుతో ఆయన చేరికకు బ్రేక్ పడింది. మరోవైపు భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సైతం అభ్యంతరం వ్యక్తం చేయడంతో టిడిపి హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని ప్రచారం జరిగింది. అయితే మొన్నటికి మొన్న గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన సంగతి తెలిసిందే. నాలుగు దశాబ్దాల తర్వాత గ్రేటర్ విశాఖను కైవసం చేసుకుంది తెలుగుదేశం పార్టీ. అవిశ్వాసానికి మద్దతుగా చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పోరేటర్లు ఓటు వేశారు. అందులో మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ రావు కుమార్తె ఒకరు. అందుకే అవంతి శ్రీనివాసరావుకు టిడిపి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది.
* కొద్ది రోజుల కిందట వైసీపీకి రాజీనామా..
2024 ఎన్నికల్లో భీమిలి( Bheemily ) నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు అవంతి శ్రీనివాసరావు. టిడిపి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేతిలో అవంతి శ్రీనివాసరావు ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. కొద్ది నెలల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఆయనకు విద్యాసంస్థలు సైతం ఉన్నాయి. వ్యాపార కార్యకలాపాలు సైతం సాగిస్తున్నారు. వాటి కోసమే ఆయన అధికార పార్టీలోకి చేరుతున్నారని ఒక ప్రచారం ఉంది. అయితే తరచూ పార్టీలు మారడం అవంతి శ్రీనివాసరావుకు వెన్నతో పెట్టిన విద్య. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపుతారు అన్న కామెంట్ ఆయనపై ఉంది.
Also Read : పదేళ్లలో నాలుగు పార్టీలు.. ఇప్పుడు ఐదో పార్టీలోకి.. ఆ నేత ఎవరంటే?
* అధికార పార్టీ వైపు మొగ్గు
2009లో ప్రజారాజ్యం( Praja Rajyam ) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అవంతి శ్రీనివాసరావు. గంటా శ్రీనివాసరావు నేతృత్వంలోని ఓ నేతల బృందం అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో చేరింది. అలా 2009లో ప్రజారాజ్యం పార్టీ టికెట్ పై భీమిలి అసెంబ్లీ స్థానానికి పోటీ చేశారు అవంతి శ్రీనివాసరావు. ఆ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనం కావడంతో ఆ పార్టీ అనుబంధ సభ్యుడిగా మారిపోయారు. 2014 ఎన్నికల కు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ముందస్తు ఒప్పందం ప్రకారం 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా భీమిలి నుంచి పోటీ చేసి గెలిచారు. దీంతో జగన్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో ఇప్పుడు అధికార పార్టీ టిడిపి వైపు చేరేందుకు అవంతి శ్రీనివాసరావు ప్రయత్నాలు చేస్తున్నారు.
* ఆ ఒక్క అభ్యంతరంతో..
అయితే మంత్రిగా ఉండే సమయంలో టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టారన్న విమర్శ అవంతి శ్రీనివాసరావు పై ఉంది. అందుకే ఆయన చేరికకు ఇబ్బందికరంగా మారింది. కానీ టిడిపిలో ఉన్న తన పాత పరిచయాలను ఉపయోగించుకొని పార్టీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అవంతి శ్రీనివాసరావు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. తన కుమార్తె టిడిపికి మద్దతు ఇవ్వడం ద్వారా సరైన సంకేతాలు పంపారు. అవంతి శ్రీనివాసరావు విషయంలో గంటా శ్రీనివాసరావు సైతం మెత్తబడడంతో హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో అవంతి శ్రీనివాసరావు టిడిపిలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.