Attack On Jagan: జగన్ పై అక్కడి నుంచే దాడి

రాష్ట్ర సీఎం పైనే దాడి జరగడం రాజకీయ దుమారానికి దారితీసింది. జగన్ కావాలనే నాటకం ఆడుతున్నారని టిడిపి నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు.

Written By: Dharma, Updated On : April 14, 2024 5:49 pm

Attack On Jagan

Follow us on

Attack On Jagan: రాష్ట్ర రాజకీయాల్లో సీఎం జగన్ పై రాళ్ల దాడి పెను కుదుపుగా మారింది. అయితే ఆయనపై ఒకసారి కాదు రెండుసార్లు దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. గజమాల వేస్తున్న సమయంలో ఒకసారి.. కొంత దూరం వెళ్లిన తర్వాత మరోసారి దాడి జరిగినట్లు గుర్తించారు. అయితే మొదటిసారి దాడిని లైట్ తీసుకున్నారు. కానీ తర్వాత రాయి నేరుగా వచ్చి గట్టిగా తగిలింది. ప్రధానంగా విజయవాడ సింగ్ నగర్ పాఠశాల వద్దకు వచ్చేసరికి ఈ రాయి తగిలినట్లు సమాచారం. అప్పటికే చిమ్మ చీకటి ఉంది. పాఠశాల గదుల్లో నక్కిన ఆగంతకులు రాళ్లు విసిరినట్లు సమాచారం. అయితే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు, వాట్సాప్ గ్రూప్ చాటింగ్ గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే రాష్ట్ర సీఎం పైనే దాడి జరగడం రాజకీయ దుమారానికి దారితీసింది. జగన్ కావాలనే నాటకం ఆడుతున్నారని టిడిపి నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. కోడి కత్తి 2.0 గా అభివర్ణిస్తున్నారు. ఎన్నికల సమయంలో కావాలనే దాడులు చేయించుకుని.. దానిని సానుభూతి కోణంలో చూపించి ఓట్లు దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారని టిడిపి ఆరోపిస్తోంది. ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడేనని చెబుతూ.. కొన్ని రకాల అంశాలను కూడా తెరపైకి తెచ్చారు.

అయితే సానుభూతి దక్కించుకోవాలన్న కోణంలో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేస్తారంటే అది అతిశయోక్తి అవుతుంది. సానుభూతి అనేది కొంత వరకే పని చేస్తుంది. అన్నివేళలా పనిచేయదు. కానీ వైసీపీ విషయానికి వచ్చేసరికి.. ఆ పార్టీకి సానుభూతే పునాది. కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం, ఆయన వారసుడిగా జగన్ ను కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోకపోవడం, కేసులతో జగన్ ను వేధించడం తదితర కారణాలతో ప్రజలు జగన్ పట్ల విపరీతమైన సానుభూతి చూపించారు. అందుకే ఆయన కొత్త పార్టీ పెట్టినా ఆదరించారు. గత ఎన్నికలకు ముందు వివేకానంద రెడ్డిహత్య, కోడి కత్తి ఘటన వంటివి ఎనలేని సానుభూతిని తెచ్చిపెట్టాయి. జగన్ ను అధికారంలోకి తెచ్చాయి. అయితే ఎల్లవేళలా ఈ సానుభూతి వర్కౌట్ కాదు. సానుభూతి కోసం ఇలాంటి చర్యలు ఎవరూ చేయరు. అందుకే ఈ ఘటనకు సంబంధించి నిజా నిజాలు తెలియాలి. వాస్తవాలు బయటకు రావాలి. దీనిపై అత్యున్నత దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టాలి. అయితే కేంద్ర నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థల విచారణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఎన్నికల ముంగిట ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. దీని దర్యాప్తు సవ్యంగా జరుగుతుందని ఆశించడం కూడా అతి అవుతుంది.