Attack on Jagan helicopter : వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) అనంతపురం పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఏప్రిల్ లో శ్రీ సత్యసాయి జిల్లా రామగిరిలో చనిపోయిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారు. ఆ సమయంలో హెలిక్యాప్టర్ పై జనం ఎగబడ్డారు. దీంతో హెలిక్యాప్టర్ విండ్ షీల్డ్ ధ్వంసం అయింది. ఈ ఘటనతో జగన్మోహన్ రెడ్డి భద్రతలో లోపాలు వెలుగు చూసాయి. దీనిపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందుకే గత కొద్దిరోజులుగా దీనిపై విచారణ చేపడుతున్నారు. అయితే ఇప్పటికే మూడుసార్లు పైలట్ అనిల్ ను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపారు. కానీ గత మూడుసార్లుగా గైర్హాజరయ్యారు పైలెట్. నాలుగోసారి నోటీస్ ఇచ్చేసరికి హాజరయ్యారు. విచారణ అధికారి ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకున్నారు.
* అనంతపురం పర్యటనలో
ఏప్రిల్ 8న అనంతపురం జిల్లా( Ananthapuram district) రామగిరి మండలం పాపిరెడ్డి పల్లికి హెలికాప్టర్ పై వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ల్యాండ్ అయిన హెలికాప్టర్ ను చుట్టుముట్టారు. దీంతో హెలిక్యాప్టర్ విండ్ షీల్డ్ వంశం అయింది. అయితే హెలికాప్టర్ దెబ్బతిన్న విషయం పోలీసులకు చెప్పకుండా పైలట్, కో పైలట్ వెళ్ళిపోయారు. అయితే ఈ ఘటనపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. భద్రతా లోపాలతోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వం కుట్ర కోణంలో అనుమానిస్తోంది. ఒక్కసారిగా హెలిపాడ్ వద్దకు జనాలను విడిచిపెట్టడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై డిఎస్పి సైతం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి పర్యటన వివరాలు కావాలని అడిగి తెలుసుకున్నారు. హెలిప్యాడ్ వద్దకు ఒకేసారి జనాలు రావడం వెనుక తోపుదుర్తి పాత్ర ఉందన్న అనుమానాల నేపథ్యంలో విచారణ అధికారుల ఆయనను సైతం ప్రశ్నించినట్లు సమాచారం.
Also Read : ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి: జగన్
* నాలుగో సారి హాజరు
అయితే గత మూడుసార్లు విచారణకు గైర్హాజరయ్యారు పైలెట్ అనిల్( pilot Anil). నిన్న జరిగిన విచారణకు మాత్రం హాజరయ్యారు. అయితే మూడుసార్లు నోటీసులు జారీ చేసిన ఎందుకు హాజరు కాలేదని విచారణ అధికారి ప్రశ్నించారు. అయితే జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తిరిగి తీసుకెళ్లలేదని.. హెలిక్యాప్టర్లో ఏమైనా ఇబ్బంది తలెత్తిందా? ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారా? హెలికాప్టర్ వెనక్కి తీసుకెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు విచారణ అధికారి. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేక, సంస్థలో వేరే విధులకు హాజరు కావడంతోనే విచారణకు రాలేదని పైలెట్ అని వివరించారు.
* ఆరోజు జరిగింది అదే..
మరోవైపు ఆరోజు భారీగా జనాలు తరలి రావడంతో ఆందోళనకు గురయ్యామని చెప్పుకొచ్చారు. జనం చుట్టుముట్టి లోపల ఉన్న జగన్ తో మాట్లాడే ప్రయత్నం చేశారని.. అయితే జగన్ ఏం చెబుతున్నారో తెలియక.. వారంతా హెలిక్యాప్టర్ పై పిడుగుద్దులు కురిపించారని నాడు జరిగిన విషయాలను చెప్పారు పైలెట్ అనిల్. అప్పటికే సైడ్ మిర్రర్ చీలిపోయిందని.. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని తీసుకొని గాల్లోకి ఎగిరితే అది పగిలి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండేదని.. టేక్ ఆఫ్ అయ్యే సమయంలో జనం మరోసారి చుట్టూ ముడితే టెయిల్ రోటర్ వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కూడా చెప్పుకొచ్చారు. ఏవియేషన్ సంస్థ కు సమాచారం అందించామని.. వారి ఆదేశాలతోనే హెలిక్యాప్టర్ ను వెనక్కి తీసుకెళ్లినట్లు పైలట్ అనిల్ విచారణ అధికారికి వివరించారు. కాగా ఉదయం 11:20 గంటల నుంచి 2:20 వరకు పైలట్ ను విచారించారు. అయితే హెలిపాడ్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలు, వైసీపీ నేతల సోషల్ మీడియా ప్రకటనల నేపథ్యంలో కుట్ర కోణంలో విచారణ చేపడతామని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తో పాటు 85 మందిని విచారించారు. మరో 15 మందిని విచారించనున్నారు.