Andhra cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీడాకారుల ఎంపిక, క్రికెట్ టోర్నీల నిర్వహణలో కీలక పాత్ర పోషించేది. చాముండేశ్వరి నాథ్, గోకరాజు గంగరాజు లాంటివారు అసోసియేషన్ నడిపేవారు. క్రికెట్ రంగానికి సంబంధించినది కావడం, దండిగా ఆదాయం వచ్చే మార్గం కావడంతో.. దీనిపై వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కన్ను పడింది. వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని హస్తగతం చేసుకోవడం ప్రారంభించారు. తన అల్లుడు, ఆయన సోదరుడు అరబిందో శరత్ చంద్రారెడ్డిని అసోసియేషన్ పీఠంపై కూర్చోబెట్టారు. గోపీనాథ్ రెడ్డి అనే బినామీతో కథ నడిపించారు. గత ఐదేళ్ల కాలంలో క్రీడాకారుల ఎంపిక, క్రికెట్ పోటీల సమయంలో టిక్కెట్ల దందా, స్టేడియంలో వ్యాపార లావాదేవీలు.. ఇలా ఒకటేమిటి కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. రంజీ క్రీడాకారుల ఎంపికలు సైతం రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేశారన్న విమర్శలు కూడా వచ్చాయి. క్రీడాకోటా ఉద్యోగాల కోసం భారీ ఎత్తున సర్టిఫికెట్ల జారీ కూడా జరిగిందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. విజయసాయిరెడ్డి తెర వెనుక నుండి ఇదంతా జరిపారన్న అనుమానాలు ఉన్నాయి. ఏసీఏ సభ్యులను లోబరుచుకుని ఈ దందా సాగించారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీఏలో జరిగిన లీలలు బయటపడ్డాయి. దీంతో సభ్యులతో మూకుమ్మడిగా రాజీనామా చేయించే పనిలో ప్రభుత్వం పడింది. కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేయనుంది.
* అపెక్స్ కౌన్సిల్ రాజీనామా
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు రాజీనామా చేశారు. విజయవాడలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకంగా కౌన్సిల్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో వచ్చే నెలలో ఏసీఏ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ వ్యవహరిస్తారు. కొత్త అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని నాని ఎంపికయ్య చాన్స్ కనిపిస్తోంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల వరకు ఏసీఏ సేవలకు అంతరాయం కలగకుండా ముగ్గురు సభ్యుల కమిటీని నియమించారు. ఇందులో మాజీ మంత్రి కే.రంగారావు, మురళీమోహన్ సభ్యులుగా వ్యవహరిస్తారని సమావేశంలో తీర్మానించారు.
* రాజకీయ సిఫార్సులు
గత ఐదు సంవత్సరాలుగా ఏసీఏలో రాజకీయ సిఫార్సులకు పెద్దపీట వేశారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా క్రీడాకారుల ఎంపికలు వైసీపీ నేతల ఒత్తిడికి తల వంచారని కూడా విమర్శలు వచ్చాయి. ఓ అంతర్జాతీయ క్రీడాకారుడికి దారుణ అవమానం ఎదురయిందని.. వైసీపీ నేత కుమారుడైన రంజీ క్రీడాకారుడు దారుణంగా అవమానించిన ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చివరకు ఆ అంతర్జాతీయ క్రీడాకారుడు ఆంధ్ర రంజీ టీం నుంచి బయటకు వెళ్లిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఏసీఏ జారీచేసిన క్రీడా సర్టిఫికెట్లతో చాలామంది అక్రమంగా ఉద్యోగాలు పొందినట్లు కూడా తెలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే విజయసాయిరెడ్డి తన ఆధీనంలో ఏసీఏను ఉంచుకొని.. ఎన్ని రకాల అక్రమాలు చేసారో తెలియదని టిడిపి శ్రేణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశాయి.
* 8న కొత్త అధ్యక్షుడు ఎన్నిక
వచ్చేనెల 8న గుంటూరులో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని పోటీ చేయనున్నారు. జిల్లా క్రికెట్ సంఘాలు, వివిధ క్లబ్లు ఆయన అభ్యర్థిత్వంపై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కనీసం టిడిపి ప్రభుత్వ హయాంలో నైనా.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పారదర్శకంగా పాలన నడిపిస్తుందా? లేదా? అన్నది తెలియాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More