Ashok Gajapathi Raju: సర్పంచ్, ఎంపీపీ అయితేనే దర్పం చూపుతున్న రోజులు ఇవి. అటువంటిది సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉన్న ఓ నాయకుడు సాధారణ వ్యక్తిగా సాదాసీదా జీవితాన్ని గడపడం ఒక ప్రత్యేకత. పోనీ ఆయనేమీ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా కాదు. రాజుల కుటుంబానికి చెందినవారు. వేల ఎకరాల భూమికి అధిపతి. అటువంటి వ్యక్తి రైల్వే స్టేషన్ లో సాధారణ ప్రయాణికుడిగా కనిపించడం ప్రత్యేకతే కదా. ప్రస్తుతం ఈ నేత ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా.. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు.
అశోక్ గజపతి రాజుది సాధారణ జీవితమేనని విజయనగరం ప్రజలకు తెలుసు. బంగ్లాలో ఉన్నా సామాన్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. అవినీతి, వివాదాలకు ఆయన అతీతంగా వ్యవహరిస్తారనే పేరు ఉంది. అశోక్ గజపతిరాజు తన సతీమణి సునీలా, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్ర వెళ్లేందుకు నాంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైలు వచ్చేవరకు వీఐపీ వెయిటింగ్ రూం అందుబాటులో ఉన్నా.. సాధారణ ప్రయాణికులతో పాటుగా ప్లాట్ ఫామ్ పై ఉన్న ఒక దిమ్మెకు ఒరిగి కూర్చున్నారు. రైలు కోసం వేచి చూస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ దృశ్యం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అశోక్ గజపతిరాజు సాధారణ జీవితాన్ని నెటిజెన్లు చూసి అభినందనలు తెలుపుతున్నారు.
స్వతహాగా రాజు అయిన అశోక్ గజపతిరాజు హైదరాబాదు నుంచి ఇంటికి వెళ్లేందుకు సామాన్యుడిలా రైల్వేస్టేషన్లో ఎదురు చూశారని టిడిపి ట్విట్టర్లో పేర్కొంది. నిజాయితీకి, పరిపూర్ణతకు ఆయన నిదర్శనమని అభివర్ణించింది. అయితే అశోక్ గజపతిరాజు సాధారణ జీవితం విజయనగరం ప్రజలకు తెలియంది కాదు. తాను ఒక రాజునని, రాజ కుటుంబానికి చెందిన వాడినని, కీలక పదవులు అలంకరించానని దర్పం ప్రదర్శించని వ్యక్తిత్వం ఆయనది. రాజకీయ ప్రత్యర్థులు సైతం రాజుగారు అంటే గౌరవిస్తారు. అంతకుమించి అభిమానిస్తారు.