YS Vijayamma Christmas news: వైఎస్ విజయమ్మ( YS vijayamma ) వ్యవహార శైలి భిన్నంగా ఉంది. పిల్లలిద్దరి మధ్య ఆమె నలిగిపోతున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి తో కనిపిస్తున్నారు. ఇంకోసారి షర్మిల తో ఉంటున్నారు. కానీ పిల్లలిద్దరూ ఒకరినొకరు వ్యతిరేకించుకుంటున్నారు. అయితే వారిద్దరినీ కలపాల్సిన విజయమ్మ.. ఇద్దరితోనూ సన్నిహితంగా మెలుగుతున్నారు. తాజాగా క్రిస్మస్ వేడుకల్లో కుమారుడు జగన్మోహన్ రెడ్డి తో కనిపించారు. కోడలు భారతితో కూడా ఆప్యాయంగా మెలిగారు. అయితే ఆమె కన్ఫ్యూజన్లో ఉన్నారా? పిల్లలిద్దరినీ కలపలేకపోతున్నారా? అనేది ఒక చర్చ. క్రిస్మస్ వేడుకలతో పాటు రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, జయంతి నాడు అందరి దృష్టి విజయమ్మ పైనే ఉంటుంది. ఆమె విషయంలో మీడియా ఫోకస్ ఉంటుంది. అయితే ఈ ఏడాది క్రిస్మస్ వేడుకల్లో కొడుకు, కోడలితోనే ఆమె కనిపించడం విశేషం.
రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం..
రాజశేఖర్ రెడ్డి( y s Rajasekar Reddy ) బతికున్నంత కాలం ఆ కుటుంబ మహిళల పేర్లు కానీ వినిపించేది కాదు. రాజకీయ వేదికలు పంచుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి మరణించారో.. నాటి నుంచి విజయమ్మ బయటకు అడుగు వేశారు. తండ్రి ముఖ్యమంత్రి పదవి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని ఢిల్లీ వెళ్లి హై కమాండ్ ను కోరారు. కాంగ్రెస్ పార్టీతో విభేదించేసరికి జగన్మోహన్ రెడ్డి చుట్టూ కేసులు అల్లుకున్నాయి. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో కుమారుడు జగన్మోహన్ రెడ్డి కోసం గట్టిగానే నిలబడ్డారు విజయమ్మ. చివరకు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు. అలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే కాదు.. ప్రత్యక్ష ఎన్నికల బరిలో కూడా నిలిచారు. ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. అప్పటినుంచి రాజకీయ పర్యటనలు, ఎన్నికల ప్రచారాలు ఆమెకు అలవాటైపోయాయి.
కుమార్తెకు అండగా ఉండే క్రమంలో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించారు విజయమ్మ. అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చి.. షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారో అప్పటినుంచి.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డికి దూరమవుతూ వచ్చారు. అయితే షర్మిలకు గట్టిగా అండగా నిలిచారు. అయితే ఆమె నిలబడలేదు తెలంగాణలో. ఏ కాంగ్రెస్ తో వైయస్సార్ ఫ్యామిలీ విభేదించిందో.. అదే పార్టీ అధ్యక్షురాలిగా మారారు షర్మిల. అప్పటినుంచి మీడియా ఫోకస్ అంతా రాజశేఖర్ రెడ్డి పిల్లలపై ఉంది. మధ్యలో విజయమ్మ ఉంటున్నారు. కక్కలేక మింగలేని పరిస్థితి ఆమెది. ఒకసారి షర్మిల కు మద్దతుగా ఆస్తుల బదలాయింపు జరిగింది. దానిపై జగన్ కోర్టుకు వెళ్లారు. ఆస్తుల వివాదం ఒకవైపు నడుస్తుండగా షర్మిల తోనే ఎక్కువగా ఉంటున్నారు విజయమ్మ. మధ్య మధ్యలో జగన్ వెంట కనిపిస్తున్నారు. ఈ పరిస్థితిని చూస్తున్నవారు విజయమ్మ దుస్థితి ఏ తల్లికి రాకూడదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.