YS Jagan Silence
YS Jagan Silence : జగన్ సీనియర్లకు పిలిచి మాట్లాడడం లేదా?వారిని అసలు పట్టించుకోవడం లేదా? ఎన్నికల్లో చూద్దాంలే అని ధీమాతో ఉన్నారా? తనకు జనంతో పని.. నేతలతో లేదనుకుంటున్నారా? అందుకే ఒక్కొక్కరు పార్టీకి దూరమవుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ఫలితాల అనంతరం చాలామంది నేతలు పార్టీకి దూరమయ్యారు. విజయవాడ ఎంపీగా పోటీ చేసిన కేశినేని నాని క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. సినీ నటుడు అలీ తనకు వైసీపీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. గుంటూరుకు చెందిన కిలారి రోశయ్య, మద్దాలి గిరి వంటి వారు పార్టీని వీడారు. తాజాగా ఆళ్ల నాని పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ వీరెవరితోనూ జగన్ నేరుగా మాట్లాడలేదని తెలుస్తోంది. జనంతో తన పని అని.. నాయకులతో పని లేదన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. మళ్లీ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తే నేతలు వారే దారిలోకి వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకే పెద్దగా పట్టించుకోవడంలేదని తెలుస్తోంది. పార్టీ నుంచి వెళ్ళిపోతామన్నవారికి అడ్డుకోవడం వేస్ట్ అని.. వారిని బతిమిలాడి తెచ్చినా పార్టీలో వారు ఉండరు అన్నది హై కమాండ్ అభిప్రాయం. అయితే అధికారంలో ఉన్నప్పుడు ఈ తరహా అభిప్రాయం నిజమే. కానీ వైసీపీ ఇప్పుడు ప్రతిపక్షం. అందులోనూ ఘోర ఓటమి ఎదురైన సమయం. ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేయకపోతే పార్టీకి మరింత ముప్పు తప్పదు.
* అటువంటివారు సైలెంట్ గా
వైసిపి తో పాటు అధినేత పై మంచి అభిప్రాయం ఉన్నవారు ప్రస్తుతం గుంభనంగా ఉన్నారు. కానీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ వైఖరితో బాధపడిన వారు, నచ్చని నేతలు ఇప్పుడు బయటపడుతున్నారు. పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు. ఇక అధినేత వైఖరిలో మార్పు రాదని.. పార్టీ మళ్లీ పూర్వవైభవం సాధించినా తమ వరకు ప్రయోజనం ఉండదని భావిస్తున్న నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
* ఆ విధానాలతో విసిగి
గెలిస్తే తన విజయమని చెప్పుకునే స్థితిలో జగన్ ఉంటారు. ఓడిపోతే మాత్రం మిగతా నేతల వైఫల్యం అని చెప్పుకొస్తారు. చాలామంది నేతలు రుచి చూశారు వైసీపీలో. పార్టీ గెలిచినప్పుడు విధులు ఉండవు.. నిధులు ఉండవు. అంతకంటే మించి విలువ ఉండదు. అటువంటి పార్టీలో కొనసాగడం దండగ అన్న అభిప్రాయం చాలామంది వైసిపి నేతల్లో ఉంది.
* ఆళ్ల నాని అసంతృప్తి ఇప్పటిది కాదు
ఆళ్ల నాని లో అసంతృప్తి ఇప్పటిది కాదని తెలుస్తోంది. 2022లో మంత్రి పదవి నుంచి తప్పించారు. దీంతో ఆయనకు హై కమాండ్ తో గ్యాప్ ఏర్పడింది. 2024 ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు కూడా ముప్పు తిప్పలు పెట్టారు. ఆళ్ల నాని ఇబ్బంది పడ్డారు. కానీ పార్టీ మారడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు అందరు మాదిరిగానే ఓడిపోయారు. వైసిపి దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు తనకు టైం దొరికింది. ముందుగా పార్టీ పదవులకు రాజీనామా చేశారు. జగన్ పిలిచి మాట్లాడలేదు. ఇదే అదునుగా ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దీంతో తనకు స్వేచ్ఛ దొరికింది. కొద్ది రోజులపాటు గ్యాప్ తీసుకుని నచ్చిన పార్టీల్లో చేరడానికి నాని సిద్ధం చేసుకుంటున్నారు. అయితే నాని లాంటి నేతలు వైసీపీలో ఇంకా చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Are they changing the party unless jagan talks to them
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com