Araku : ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని( World Health Day) పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సూర్య నమస్కారాలు ఆకట్టుకున్నాయి. ప్రపంచ గుర్తింపు పొందాయి. వరల్డ్ రికార్డ్స్ ను అందుకున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సూర్య నమస్కారాలు నిర్వహించారు. 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు నిర్వహించారు ఆ గిరిజన విద్యార్థులు. ప్రపంచంలోనే ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అందరి మన్ననలు అందుకుంటున్నారు.
Also Read : వెళ్తున్న రైలు నుంచి విడిపోయిన బోగీలు.. ఏపీలో తప్పిన ప్రమాదం!
* సుమారు 20వేల మంది విద్యార్థులతో..
అరకులోయతో ( Araku loya )పాటు ఐదు మండలాల నుంచి సుమారు 20వేల మంది గిరిజన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ వేలాదిమంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. దీనిని లండన్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా గుర్తించింది. అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగింది ఈ భారీ ఈవెంట్. గిరిజన విద్యార్థుల శక్తి సామర్ధ్యాలకు అద్దం పట్టింది. జిల్లా ఇన్చార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభం నుంచి 108 నిమిషాల పాటు నిరంతరాయంగా కొనసాగింది. లండన్ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ మేనేజర్ అలిస్ రేనౌడ్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
* ఐదు నెలలుగా విద్యార్థులు శ్రమ..
గత ఐదు నెలలుగా విద్యార్థులు శ్రమించారు. యోగ( yoga) సాధనలో పాల్గొన్నారు. ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకే నిద్రలేచే వాళ్ళు. క్రమం తప్పకుండా యోగా, సూర్య నమస్కారాలు, ఇతర ఆసనాల్లో శిక్షణ పొందారు. దీని ఫలితంగా గిన్నిస్ బుక్ రికార్డును సాధించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల పర్యవేక్షణలో వీరికి శిక్షణ ఇచ్చారు. ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు మార్గదర్శకం చేశారు. ఈ కార్యక్రమం విద్యార్థుల చిత్తశుద్ధికి, వారి శారీరక మానసిక దృఢత్వానికి నిదర్శనంగా నిలిచింది.
* జిల్లా యంత్రాంగం భాగస్వామ్యం..
జిల్లా యంత్రాంగం( district officers ) సైతం ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయింది. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, జిల్లా అధికారులు ఇందులో పాల్గొన్నారు. విద్యార్థులకు ఎలాంటి లోటు రానివ్వకుండా చూసుకుందామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు అవసరమైన రవాణా భోజన వసతులు సైతం కల్పించారు. కాగా గంటల తరబడి కార్యక్రమం కావడం .. ఎండ తీక్షణంగా ఉండడంతో విద్యార్థులు అస్వస్థతకు గురి కాకుండా ఉండేందుకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను అందించారు. కార్యక్రమం సక్సెస్ కావడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
Also Read : మావోయిస్టుల అడ్డాకు పవన్… రెండు రోజుల పాటు ఆ ప్రాంతాల్లోనే!