AP Weather Update: ఏపీకి( Andhra Pradesh) వర్ష సూచన. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనం గా మారే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు కదలనుంది. దీని ప్రభావంతో శ్రీలంక సమీపంలో మరో ఆవర్తనం ఏర్పడనుంది. అయితే ఇలా వరుసగా ఏర్పడిన ఆవర్తనాల ప్రభావంతో ఏపీలో చాలా జిల్లాలకు వర్ష సూచన తెలిపింది విశాఖలో వాతావరణ కేంద్రం. ప్రధానంగా నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, కడప ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఈ మేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.
దంచి కొట్టిన వర్షాలు
ఏపీకి గత నెలలో వర్షాలు దంచి కొట్టాయి. సెప్టెంబర్ తో పాటు అక్టోబర్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో పడింది వర్షం. ప్రధానంగా మొంధా తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు భయపడిపోయారు. కానీ గరిష్ట స్థాయిలో నష్టం చేయకుండా.. తుఫాను తీరం దాటిపోయింది. అయితే ఈ తుఫాన్ తీరం దాటిన తర్వాత ఏపీకి వర్ష సూచన తగ్గింది. పొడి వాతావరణం నెలకొంది. కానీ ఇప్పుడు బంగాళాఖాతంలో ఆవర్తనాలు ఏర్పడడంతో వర్షాలు మళ్లీ ప్రారంభమయ్యేలా ఉన్నాయి. మరోవైపు ఖరీఫ్ లో భాగంగా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో వర్షాలు పడితే ఇబ్బందికరమే.
పెరిగిన చలి తీవ్రత..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. విశాఖ మన్య ప్రాంతంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఎదుట వాహనాలు కూడా కనిపించని రీతిలో ఈ పొగ మంచు ప్రభావం ఉంది. అయితే ఆకాశంలో మబ్బుల నేపథ్యంలో, మేఘాలు ఉండడంతో చలి తీవ్రత తగ్గుతూ వచ్చింది. అయితే ఈ తుఫాను ప్రభావం దాటి పోతే తిరిగి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వృద్ధులతోపాటు చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఆవర్తనం ఉంది. అది క్రమేపి ఆగ్నేయ బంగాళాఖాతం వైపు ప్రయాణించనుంది. అల్ప పీడనం గా మారి తుఫాన్ గా మారనుంది. అదే సమయంలో శ్రీలంక వైపు కూడా ఒక అల్పపీడనం ఏర్పడడంతో ఏపీ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.