AP Weather Report Today: ఏపీకి( Andhra Pradesh) భారీ వర్ష సూచన. పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడింది. నేడు వాయుగుండం గా మారి అవకాశం ఉంది. దీనిపై ప్రత్యేక ప్రకటన జారీ చేసింది వాతావరణ శాఖ. మరో 24 గంటల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా తీరాలను దాటి.. ఒడిస్సా, చత్తీస్గడ్ పయనించనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు చత్తీస్గడ్ లో మరో అల్పపీడనం విదర్భ వద్ద కేంద్రీకృతం అయి ఉంది. వాటి ప్రభావంతోనే ఏపీలో విస్తారంగా వర్షాలు పడే సూచన కనిపిస్తోంది.
Also Read: ఆ నాలుగు జిల్లాల్లో హై అలెర్ట్ .. బయటకు రావద్దు.. ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక!
భారీ నుంచి అతి భారీ వర్షాలు..
మరోవైపు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అందుకే బంగాళాఖాతం( Bay of Bengal ) నుంచి కోస్తాంధ్ర పైకి విస్తారంగా తేమ గాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన ఉంది. అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. సోమవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానం, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కుంభవృష్టిగా వర్షం కురిసే అవకాశం ఉంది. కోస్తా లోని మిగిలిన జిల్లాల్లో సైతం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.
ఆ జిల్లాలకు హెచ్చరిక..
చాలా జిల్లాలకు హెచ్చరికలు జారీచేసింది విపత్తుల నిర్వహణ సంస్థ. విశాఖపట్నం( Visakhapatnam), అనకాపల్లి,అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వచ్చింది. మరోవైపు కర్నూలు, అనంతపురం, వైయస్సార్ కడప, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
Also Read: ఏపీలో ఏంటీ విలయం!
పోర్టుల్లో ప్రమాద హెచ్చరిక..
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు( fisheries) చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద సూచికలు ఎగురవేశారు. ప్రభుత్వం సైతం అప్రమత్తం అయ్యింది. హోంమంత్రి వంగలపూడి అనిత జిల్లా కలెక్టర్లతో సమావేశం అయ్యారు. అత్యవసర సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అవసరం అనుకుంటే ఎస్టిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించాలని సూచించారు. భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.