Mock Assembly In AP: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ శాసనసభకు హాజరు కావడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి సభకు గైర్హాజరవుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. 18 నెలలు దాటుతున్న అదే స్టాండ్ తో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గైర్హాజరుపై ప్రజల్లో ఒక రకమైన భిన్నాభిప్రాయం ఉంది. అయితే గతంలో సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరుతోనే.. జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నట్లు అర్థమవుతోంది. అయితే దేశంలో ఎక్కడా లేనివిధంగా సభకు హాజరు కాకపోవడం అనేది ఏపీలోనే కొనసాగుతోంది. అయితే దానికి కనువిప్పు కలిగేలా విద్యార్థులు అసెంబ్లీ నిర్వహించి ఆకట్టుకున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏపీ శాసనసభలో విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పాత్రను పోషించారు. వారిని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభినందించారు.
* కొద్ది రోజుల కిందట నుంచి సన్నాహాలు..
కొద్ది రోజుల కిందట పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh ) విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి సీఎం చంద్రబాబు అనుమతి తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి ఈ అసెంబ్లీకి గాను విద్యార్థులను ఎంపిక చేశారు. సమకాలిన అంశాలపై అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలోని శాసనసభలో విద్యార్థులతో సభ ఏర్పాటు చేశారు. అచ్చం ఒరిజినల్ అసెంబ్లీ మాదిరిగా సీఎంతో పాటు ప్రతిపక్ష నేత, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలుగా విద్యార్థులు వ్యవహరించారు. ప్రశ్నోత్తరాలతో పాటు పలు అంశాలపై చర్చలు కూడా జరిపారు. ఈ సభ ఆసక్తికరంగా సాగింది. అయితే పిల్లలతో శాసనసభ ఏర్పాటు చేయాలన్న ఆలోచన నారా లోకేష్ ది. దీంతో ఆయనకు అభినందనలు వెలువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది పాఠశాలల్లో విద్యార్థుల శాసనసభకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం చేశారు. అందుకు తగ్గట్టు ఏర్పాటు చేశారు.
* రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్..
అయితే విద్యార్థుల శాసనసభతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. సభకు వైసీపీ ఎమ్మెల్యేల గైర్హాజరుపై చర్చ ప్రారంభం అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ అవుతోంది. ప్రతిపక్ష హోదాను సాకుగా చూపుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభకు హాజరు కాకపోవడం తప్పు అని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అయితే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దీనిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. పిల్లలను ప్రాథమిక స్థాయి నుండి రాజ్యాంగం పట్ల అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదం చేస్తుందని భావిస్తూ మంత్రి నారా లోకేష్ దీనిని ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో కూటమి ప్రభుత్వం అభినందనలు అందుకోగా.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజల్లో చర్చకు కారణం అవుతోంది.