Venkatrami Reddy: చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటారు. ఇప్పుడు ఏపీలో కొందరు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలకు అదే పరిస్థితి దాపురించింది. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తారు. వారి సేవల్లో తరించారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వెళ్ళామన్న విషయాన్ని కూడా మర్చిపోయారు. వైసిపి ప్రచారకర్తలుగా మారిపోయారు. దీంతో ఎన్నికల కమిషన్ చర్యలకు బాధ్యులవుతున్నారు. తాజాగా ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని ఈసీ సస్పెండ్ చేసింది. అమరావతి దాటి వెళ్ళొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. అయితే ఇప్పుడు కూడా వెంకట్రామిరెడ్డి బుకాయించేందుకు ప్రయత్నించారు. ఏకంగా ఎలక్షన్ కమిషన్ పైనే.. అదే ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు.
సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అధికారులు పాటిస్తారు. ఇది సహజం కూడా. కానీ ఏపీలో మాత్రం అంతకుమించి వ్యవహారం నడుస్తోంది. బ్యూరోక్రసి వ్యవస్థతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో పని చేస్తున్నాయి. ఆది నుంచి వెంకట్రామిరెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదమే. ఆయన వైసిపి అధికార ప్రతినిధిగా ఏనాడో మారిపోయారు. దీంతో ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వెళ్లడం, సస్పెన్షన్ ఆర్డర్ రావడం జరిగిపోయింది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఆర్డర్స్ ను తొక్కి పెట్టింది. ఇప్పుడు సిఎస్ ప్రమాదంలో పడడంతో ఈసీ ఆదేశాలను పాటించాల్సి వచ్చింది. అమరావతి దాటి వెళ్ళకూడదని సిఎస్ ఆదేశాలు ఇచ్చేదాకా పరిస్థితి వచ్చింది.
వెంకట్రామిరెడ్డి ది స్వయంకృతాపం. తాను ఒక ఉద్యోగ సంఘ నాయకుడునని ఏనాడో మర్చిపోయారు. ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టి.. ప్రభుత్వ పెద్దలతో చేతులు కలిపారు. ఒక్కమాటలో చెప్పాలంటే జగన్ కు పాలేరుగా వ్యవహరించారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడే ఫైల్స్ చోరీ చేశారన్న ఆరోపణ ఆయనపై ఉంది. జగన్ సీఎం అయ్యాక రెచ్చిపోయారు. ఉద్యోగ సంఘ నేతగాఒక ఎత్తుకు ఎదిగిపోయారు.ఈ క్రమంలో అనేక తప్పులు చేశారు. నేల విడిచి సాము చేశారు. ఇప్పుడు కిందకు దిగాల్సిన అనివార్య పరిస్థితి ఆయనది. ఉద్యోగసంఘ నేతగా పదవి వదులుకోవాల్సి ఉంటుంది.ఉద్యోగం సైతం రిస్కులో పడింది.పొరపాటున జగన్ ఓడిపోతే మాత్రం అష్ట కష్టాలు పడాల్సిందే. అయితే ఒక ఉద్యోగ సంఘ నేతగా ఎలా ఉండకూడదో.. తనను చూసి నేర్చుకోవాలని ఆయన సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది.