AP Registration Services: ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో ప్రభుత్వం కొన్ని రకాల మార్పులు తేవాలని నిర్ణయించింది. ఆ వ్యవస్థలో జరుగుతున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు సరికొత్త విధానం ప్రారంభించేందుకు నిర్ణయించింది. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు చుట్టూ ఉన్న అవినీతి మరకను తొలగించేందుకు.. దళారీ వ్యవస్థను నియంత్రించేందుకు.. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. పాస్పోర్ట్, ఆధార్ సేవా కేంద్రాల తరహాలోనే నడిచే ఈ ఆధునిక వ్యవస్థ ద్వారా పౌరులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. దస్తావేజులు తయారు చేయించుకునే అవకాశం లభిస్తుంది.
* విష ప్రచారం మొదలు..
అయితే ఇలా మార్పు ప్రయత్నాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకంగా రిజిస్ట్రేషన్ ల వ్యవస్థని ప్రైవేటీకరిస్తున్నారు అంటూ విషప్రచారం మొదలుపెట్టింది. దశాబ్దాలుగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద ఏజెంట్లుగా చలామణి అవుతున్న కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు, దళారులు ప్రజలను ఏ రకంగా పీల్చి పిప్పి చేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు.. చట్టబద్ధమైన పత్రాలకు సైతం ఏ స్థాయిలో వసూళ్లకు పాల్పడుతున్నారో తెలియనిది కాదు. సామాన్యుడి కష్టార్జితాన్ని నకిలీ పత్రాలు, ఆక్రమణల పేరుతో పక్కదారి పట్టిస్తూ.. అవినీతి నిలయాలుగా మార్చేస్తున్నారు. దీనిని నియంత్రించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను రంగంలోకి దించింది.
* ప్రభుత్వంపై ఉసిగొల్పు..
ప్రభుత్వంపై డాక్యుమెంట్ రైటర్లను ఉసిగొలుపుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి ఈ విధానంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నిర్ణయాధికారం, పత్రాల పరిశీలన, ఆమోదం, డిజిటల్ సంతకాలు, ఫైనల్ రిజిస్ట్రేషన్ వంటి అధికారాలన్నీ చట్టబద్ధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల ఆధీనంలోనే ఉంటాయి. విదేశాంగ శాఖ ఆధీనంలో పాస్పోర్ట్ సేవలు ఎలాగైతే సులభతరం అయ్యాయో.. ఇక్కడ కూడా దరఖాస్తులు నింపడం, స్లాట్ బుకింగ్, డాటా ఎంట్రీ సేవలు పారదర్శకంగా అందుతాయి. వైసిపి చేస్తున్న ప్రచారం రాజకీయాల కోసమే.. ప్రజల కోసం ప్రభుత్వం ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుడితే.. దానికి కూడా రాజకీయ రంగు పులిమి లాభం పొందాలనుకుంటుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అంతకుమించి ఏమీ కనిపించడం లేదు కూడా.