AP Rajya Sabha seats 2026: దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో పెద్ద ఎత్తున రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ జరగనుంది. ఏపీ నుంచి కూడా ఓ నలుగురు సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపిక అనివార్యంగా మారింది. అయితే ఏపీలో ఈ నాలుగు స్థానాల్లో రెండింటిని టిడిపి.. బిజెపితో పాటు జనసేనకు ఒక్కో పదవి ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మూడు పార్టీలు ఏకాభిప్రాయంతో అభ్యర్థులను సైతం నిర్ణయించుకున్నట్లు పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
జూన్ లో నాలుగు పదవులు ఖాళీ
జూన్లో ఖాళీ కాబోయే నాలుగు పదవుల్లో మూడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారివే. ఆ పార్టీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ నత్వాని పదవీ విరమణ చేయనున్నారు. టిడిపి సభ్యుడు సానా సతీష్ సైతం రిటైర్డ్ కానున్నారు. ఈ తరుణంలో మరోసారి సతీష్ కు టిడిపి చాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే మిగతా మూడు రాజ్యసభ పదవులను మూడు పార్టీలు సమానంగా పంచుకుంటాయన్నమాట. అయితే బిజెపికి సంబంధించిన పదవి తమిళనాడు నేత అన్నామలైకు ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజ్యసభ పదవి ఇవ్వడం ద్వారా కేంద్ర మంత్రివర్గంలోకి సైతం తీసుకుంటారని తెలుస్తోంది.
జనసేన నుంచి రమేష్..
జనసేనకు ఈసారి ఒక పదవి ఖాయం. ఇప్పటివరకు ఆ పార్టీకి రాజ్యసభ ప్రాతినిధ్యం లేదు. ఆ పార్టీ నుంచి ప్రముఖంగా పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరు వినిపిస్తోంది. ఆయన పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల నుంచి విశేష సేవలు అందిస్తున్నారు రమేష్ జనసేన పార్టీకి. గతంలో జనసేన కార్యాలయం కూడా లింగమనేని రమేష్ కు చెందిన భవనంగా తెలుస్తోంది. రమేష్ విషయంలో చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే టిడిపికి మిగిలి ఉన్న ఆ రాజ్యసభ పదవి కోసం దాదాపు ఒక డజను మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంకా చంద్రబాబు ఒక నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది. పార్టీలో అందరి అభిప్రాయాన్ని తీసుకొని ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. చూడాలి ఆ నిర్ణయం ఎలా ఉండబోతుందో..