AP Raitanna Meekosam Scheme: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) గుణపాఠాలు నేర్చుకున్నారు. గతంలో తన పాలనలో వెలుగు చూసిన వైఫల్యాలు, తప్పిదాలను సరి చేసుకునే పనిలో పడ్డారు. అప్పట్లో చంద్రబాబు అన్నారో? లేదో? తెలియదు కానీ.. వ్యవసాయం దండగ అన్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు ఇప్పటివరకు ప్రచారం చేస్తూ వచ్చారు. చంద్రబాబు పాలనలో వర్షాలు సరిగ్గా పడవని.. రైతులకు నిత్యం కరువు ఎదురవుతుందని ప్రత్యర్థులు ప్రచారం చేసేవారు. అయితే దానికి భిన్నంగా గత రెండేళ్ల పరిస్థితి ఉంది. గత ఏడాది సమృద్ధిగా పంటలు పండాయి. ఈ ఏడాది సైతం పంటలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో చంద్రబాబుపై ఉన్న ముద్ర చెరిగిపోయింది.
Also Read: విశాఖ గూగుల్ డేటా సెంటర్ కు వైసీపీ శ్రేణుల భూములు!
చంద్రబాబుపై ఆ విమర్శ..
అయితే రైతుల విషయంలో తనపై ఉన్న విమర్శకు పూర్తిగా చెక్ చెప్పాలని భావిస్తున్నారు చంద్రబాబు. అందుకే ఈ ఏడాది నుంచి అన్నదాత సుఖీభవ( Annadata Sukhi Bhava ) అమలు చేసి చూపిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వంతో కలిపి ప్రతి రైతుకు 20వేల రూపాయల చొప్పున సాగు ప్రోత్సాహం అందిస్తానని చెప్పారు. తొలివిడతగా ఆగస్టులో అందించగలిగారు. ఇప్పుడు మరోసారి రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. దీంతో గతానికి భిన్నంగా చంద్రబాబు పట్ల రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఎరువుల కొరతను అధిగమించి సకాలంలో రైతులకు అందించగలిగారు. ముందస్తుగానే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చారు.
Also Read: కుప్పంలో సౌత్ కొరియా పరిశ్రమ కోసం చంద్రబాబు బిగ్ స్టెప్
24 నుంచి రైతన్న మీకోసం..
అయితే రైతుల్లో మరింత సంతృప్తి శాతం పెంచేందుకుగాను చంద్రబాబు ఈనెల 24 నుంచి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. రైతన్న మీకోసం అంటూ ఒక కొత్త కార్యక్రమానికి నాంది పలికారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాదిమంది అధికారులు, సిబ్బంది రైతుల బాట పట్టేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, రైతులకు ప్రభుత్వం అందించే రాయితీలు, ఇతరత్రా అంశాలను ఈ కార్యక్రమంలో వివరించనున్నారు. ఏ రైతులను ఉద్దేశించి తనకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు మార్చారో.. అదే రైతులు తనను గుండెల్లో పెట్టుకునేలా భావిస్తున్నారు చంద్రబాబు. రైతు కోసం ఈ ప్రభుత్వం ఎంతలా పరితపిస్తుందో వివరించే ప్రయత్నం చేయనున్నారు. మొత్తానికైతే సీఎం చంద్రబాబు తనపై ఉన్న అపవాదును తొలగించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.