AP Rains : ఏపీలో( Andhra Pradesh) భిన్న వాతావరణ పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. గురువారం అర్ధరాత్రి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో పాటు కుండపోతగా వర్షం పడింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈనెల 27న కేరళకు రుతుపవనాలు తాకనున్నాయి. జూన్ 5 నాటికి ఏపీలో ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయాయి. సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వర్షం ప్రారంభం అయింది. కొన్ని జిల్లాల్లో అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
Also Read : జనసేన రాజ్యసభ పదవి ఆయనకే!
* ఏపీ వ్యాప్తంగా వర్షాలు..
అండమాన్ నికోబార్( Andaman Nicobar) దీవులకు రుతుపవనాలు తాకాయి. ఆ ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు పడుతున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో ప్రభావం అధికంగా ఉంది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పెద్ద హోల్డింగ్స్ నేలమట్టం అయ్యాయి. అండమాన్ కు రుతుపవనాలు తాకిన నేపథ్యంలో.. జూన్ మొదటి వారంలో ఏపీవ్యాప్తంగా విస్తరిస్తాయని అంచనా వేస్తున్నారు. జూన్ 5 నాటికి రాయలసీమ, దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ 10 నాటికి ఉత్తరాంధ్రతో సహా రాష్ట్రమంతటా విస్తరించే అవకాశం ఉంది.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉష్ణోగ్రతలు( temperatures ) భారీగానే నమోదు అయ్యాయి. ఉదయం నుంచి 40 డిగ్రీలకు పైగా నమోదవడంతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే రోజంతా విచిత్ర వాతావరణ పరిస్థితి కొనసాగింది. కాసేపు మబ్బులు, కాసేపు వడగాలులు, కాసేపు ఆకస్మికంగా పిడుగులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులతో వాతావరణం దోబూచులాడింది. అండమాన్ లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతోపాటు ఏపీలో వాయువ్య నైరుతి దిశగా వీస్తున్న గాలుల వల్ల ఈ భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.