AP Rain Alert: ఏపీలో వాతావరణం చల్లబడింది. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో గత రెండు రోజులుగా చల్లటి వాతావరణం నెలకొంది. మంగళవారం వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. బుధవారం తీవ్రమైంది. రాబోయే రెండు రోజుల్లో వర్ష తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రధానంగా ఉత్తర కోస్తా ప్రాంతం పై ద్రోణి ప్రభావం అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది.
రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని అంచనా వేస్తున్నారు. కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.
కోస్తా ప్రాంతంలో రెండు రోజులపాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి. ఈ రెండు రోజుల తర్వాత మళ్లీ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వర్షాలు పడే ప్రాంతాల్లో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షం కురిసే పరిస్థితి ఉంటుంది. వ్యవసాయంతో పాటు ఉపాధి పనులకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షం పడే సమయంలో సెల్ టవర్స్, చెట్లు కింద ఉండవద్దని సూచించింది. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని.. విపత్తు సంస్థల నుంచి వచ్చే హెచ్చరికలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది.