MLAs Vs Ministers: ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. మరోవైపు శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే వాయిస్ వినిపిస్తోంది. శాసనసభకు మాత్రం వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. తమకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో అడుగు పెడతానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. ఈ తరుణంలో విపక్షం లేకపోవడంతో శాసనసభ అంత రక్తి కట్టించడం లేదు. అయితే గత రెండు రోజులుగా జరుగుతున్న సమావేశాల తీరు చూస్తుంటే మాత్రం.. అధికార కూటమిలోనే కొన్ని పార్టీలు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండడం విశేషం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు జనసేన మంత్రులను.. టిడిపి మంత్రులను జనసేన ఎమ్మెల్యేలు ప్రశ్నలు సంధిస్తున్నారు. శాఖల పరమైన వైఫల్యాలను ఎండగడుతున్నారు. నిలదీసినంత పని చేస్తున్నారు. అయితే ప్రజా సమస్యల రూపంలోనే ఈ ప్రశ్నలు లేవనెత్తుతుండగా.. ఈ ప్రభావం కూటమిపై పడుతుందన్న ఆందోళన అన్ని పార్టీల్లో ఉంది.
కూటమి ( Alliance ) అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. మరో 15 ఏళ్ల పాటు కూటమి ఇలానే కొనసాగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తేల్చి చెబుతున్నారు. అయితే దీనిపై ఎక్కడైనా జనసేన నేతలు మాట్లాడితే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కూటమి ధర్మానికి విఘాతం కల్పించిన చాలామంది ఇన్చార్జిలపై వేటు వేశారు కూడా. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితిని అదుపులోకి తెచ్చినా.. శాసనసభలో వ్యవహారం చూస్తుంటే మాత్రం రెండు పార్టీల మధ్య సమన్వయం దెబ్బతింటుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకరిపై ఒకరు ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు రాబెడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేల తడబాటు కూడా కనిపిస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లేకపోవడంతో.. కూటమి ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండడం విశేషం.
* ఏకంగా డిప్యూటీ సీఎం కే నిలదీత..
రెండు రోజుల కిందట శాసనసభలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై విమర్శలు చేశారు. ఏదైనా పనిపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులను సంప్రదిస్తే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావాలని చెబుతున్నారని.. ఇదేం తీరు అని ప్రశ్నించారు. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ సైతం సానుకూలంగా స్పందించారు. సరైన జవాబు ఇచ్చారు. అయితే టిడిపి ఎమ్మెల్యే ఏకంగా డిప్యూటీ సీఎం ను ప్రశ్నించడం ఏంటనేది జనసైనికుల నుంచి వినిపిస్తున్న మాట. బోండా ఉమా ఉద్దేశపూర్వకంగానే ప్రశ్నించారని.. గతంలో కూడా పవన్ కళ్యాణ్ పై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలను గుర్తు చేస్తున్నారు జనసైనికులు.
* బియ్యం మాఫియా పై బుచ్చయ్య చౌదరి..
టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి( bhuchaya Choudhary ) రేషన్ మాఫియా పై మాట్లాడారు. పౌర సరఫరాల శాఖ పనితీరు మెరుగు పడలేదని ఆక్షేపించారు. రేషన్ బియ్యం విషయంలో ప్రభుత్వం గత ప్రభుత్వ వైఖరిని అనుసరిస్తోందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీంతో ఇరకాటంలో పడ్డారు. వాస్తవానికి పౌరసరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. రేషన్ బియ్యం మాఫియాను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు ఉపకమిస్తున్నారు. అయినా సరే సీనియర్ ఎమ్మెల్యే గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలా వ్యాఖ్యలు చేయడం ఏంటని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే చేశారని అనుమానిస్తున్నారు.
* రహదారులపై జనసేన ఎమ్మెల్యే..
ఇంకోవైపు తాడేపల్లిగూడెం( Tadepalligudem ) జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ టిడిపి మంత్రులకు భిన్న ప్రశ్నలు వేశారు. వారి శాఖల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో రహదారులు బాగా లేవని.. కాంట్రాక్టర్ను అడిగితే గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లిస్తే రోడ్ల మరమ్మత్తులు చేపడతామని అన్నారని.. మన ప్రభుత్వం రహదారులను బాగు చేయకపోతే ప్రజల్లో చెడ్డ పేరు తెచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా రహదారులు మెరుగు పడటం లేదని జనసేన ఎమ్మెల్యే వ్యాఖ్యానించి ప్రభుత్వాన్ని ఇరకాటం లో పెట్టారు. అయితే ఇవి ప్రజా సమస్యలుగా చూస్తే పర్వాలేదు.. కానీ మిత్రపక్ష మంత్రులపై నిలదీసినంత పని చేస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఎంతవరకు వెళ్తుందో నన్న అనుమానం కలుగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.