BCCI: ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఈ సిరీస్‌ను భారత్ పాకిస్తాన్ వెళ్లేందుకు నిరాకరించడంతో ఐసీసీ వేదికను దుబాయ్‌కి మార్చింది. అయినా పాక్ క్రికెటర్లకు బుద్ధి రాలేదు. టోర్నీ నిర్వహించే అవకాశం కోల్పోయిన పాకిస్తాన్.. ఆటలో కూడా పేలవ ప్రదర్శనతో తేలిపోతోంది. అయినా భారత్‌తో ఆడే మ్యాచ్‌ల సందర్భంగా ఆ జట్టు ఆటగాళ్లు పిచ్చి ప్రవర్తనతో చెర్చిపోతున్నారు. వారికి భారత ఆటగాళ్లు బ్యాట్‌తోనే సమాధానం చెబుతున్నాయి. అయినా వాళ్లను అలాగే వదిలేయకూడదని నిర్ణయించిన బీసీసీఐ తాజాగా ఐసీసీకి ఫిర్యాదు చేసింది. సెప్టెంబర్ 21, 2025న భారత్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ క్రికెటర్లు రవూఫ్, ఫర్హాన్‌ల చర్యలు వివాదాస్పదంగా మారాయి. హాఫ్ సెంచరీ సాధించిన సందర్భంగా ఫర్హాన్ ’గన్ ఫైరింగ్’ స్టైల్‌లో సెలబ్రేట్ చేయడం గమనార్హం. ఇటువంటి సంజ్ఞలు క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. ముఖ్యంగా భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌ల వంటి ఉద్విగ్న సందర్భాల్లో. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల మధ్య ఉద్రిక్తతను పెంచుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఉద్దేశపూర్వక రెచ్చగొట్టే చర్యలు
ఫీల్డింగ్ సమయంలో బౌండరీ లైన్ వద్ద రవూఫ్ చేసిన సంజ్ఞలు మరింత వివాదాన్ని రేపాయి. భారత ఫైటర్ జెట్‌లను కూల్చినట్లు సూచించేలా అతను చేసిన చర్యలు ఆట నియమాలను ఉల్లంఘించినట్లు బీసీసీఐ భావిస్తోంది. ఈ సంఘటన భారత అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది, దీంతో ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది బీసీసీఐ. ఇటువంటి సంజ్ఞలు కేవలం ఆటలో భాగమా లేక ఉద్దేశపూర్వక రెచ్చగొప్పునా అనే చర్చ ఇప్పుడు క్రీడా వర్గాల్లో నడుస్తోంది.
ఐసీసీ ఏం చేయనుంది?
బీసీసీఐ ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించి, ఐసీసీకి అధికారిక ఫిర్యాదు చేసింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం, ఆటగాళ్లు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే జరిమానాలు లేదా శిక్షలు విధించే అవకాశం ఉంది. గతంలో ఇలాంటి సంఘటనల్లో ఆటగాళ్లపై జరిమానాలు విధించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఫిర్యాదు ఫలితంగా ఐసీసీ రవూఫ్ మరియు ఫర్హాన్‌లపై ఏదైనా చర్య తీసుకుంటుందా లేక సాధారణ హెచ్చరికతో సరిపెట్టుకుంటుందా అనేది ఆసక్తికరంగా ఉంది.
భారత్–పాక్ మ్యాచ్‌ల సున్నితత్వం
భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌లు ఎల్లప్పుడూ ఉద్వేగభరితంగా ఉంటాయి. రెండు దేశాల మధ్య రాజకీయ, చారిత్రక సంబంధాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌లు కేవలం ఆటగా మాత్రమే కాక, భావోద్వేగాల సమ్మేళనంగా మారతాయి. ఇలాంటి సందర్భాల్లో ఆటగాళ్లు చేసే చిన్న చిన్న చర్యలు కూడా పెద్ద వివాదాలకు దారితీస్తాయి. ఈ సంఘటన భవిష్యత్తులో ఆటగాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని ఇస్తుంది.
క్రికెట్‌ను ’జెంటిల్మెన్స్ గేమ్’గా పిలుస్తారు. ఆటగాళ్లు తమ సెలబ్రేషన్స్, చర్యల ద్వారా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాల్సిన బాధ్యత ఉంది. ఫర్హాన్, రవూఫ్ చర్యలు ఈ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని బీసీసీఐ భావిస్తోంది. ఈ ఘటన ఆటగాళ్లు తమ చర్యల ప్రభావాన్ని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.