Jagan Mohan Reddy : అసలు జగన్ ప్లాన్ ఏంటి? సినీ పరిశ్రమ విషయంలో ఏం చేయదలుచుకున్నారు? తనపై ఉన్న వ్యతిరేక ప్రచారాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? లేకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రోత్సహించాలనుకుంటున్నారా? అసలు ఆయన ఉద్దేశం ఏంటి? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలతో దుమారం రేగింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డిని సైకోగా అభివర్ణిస్తూ.. అప్పట్లో ఎవరూ అడగలేదు.. గట్టిగా అడిగే ఛాన్స్ లేదు.. అంటూ చిరంజీవి ప్రస్తావన నేరుగా తేకుండానే తేల్చిపారేశారు బాలకృష్ణ. పైగా అవమానం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో తాను అడగడం వల్లే టిక్కెట్ల ధర పెంపు అమలయిందని చెప్పుకొచ్చారు చిరంజీవి. అది మొదలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చింది. ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.
* అభిమానంతో పాటు వ్యతిరేకులు అధికం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా అభిమానించే ప్రజలు, అభిమానులు ఉన్నారు. అదే సమయంలో విపరీతంగా ద్వేషించే వారు ఉన్నారు. మద్యస్థంగా అభిప్రాయంతో ఉన్నవారు కూడా ఉన్నారు. కానీ ద్వేషించే వారు మాత్రం విపరీతంగా ఆయన పట్ల వ్యతిరేకత చూపుతుంటారు. దానిని హైలెట్ చేసేది మాత్రం పవన్ కళ్యాణ్. చిత్ర పరిశ్రమ 2019లో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచింది. అదే చిత్ర పరిశ్రమ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వ్యతిరేకించింది. విపరీతంగా ద్వేషించింది కూడా. ఈద్వేషంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి పట్ల అభిమానం ఉన్న చిత్ర ప్రముఖులు సైతం సైలెంట్ కావాల్సి వచ్చింది.
* ఒక్కో ప్రముఖుడు తెరపైకి..
జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం పట్ల అనేక రకాల ముద్రలు వచ్చాయి. చాలా రకాల విమర్శలు ఉన్నాయి. వాటిని చెరిపే ప్రయత్నం ఇప్పుడు జరుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలతో చిరంజీవిని తెరపైకి తెచ్చారు. చిరంజీవి స్వయంగా జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చేలా ఒక ఫేక్ ప్రచారాన్ని బలంగా విడిచిపెట్టారు. మరోవైపు ఆర్ నారాయణ మూర్తి రంగంలోకి దిగారు. ఆయన బాలకృష్ణను తప్పు పట్టడం లేదు. చిరంజీవిని మెచ్చుకుంటూనే.. జగన్మోహన్ రెడ్డి ఎంతో గౌరవించారని చెబుతున్నారు. తద్వారా ఆయన వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో తెలియనిది కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే విపరీతంగా పొగిడే వారు నారాయణమూర్తి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ను పొగుడుతూ వచ్చారు. కానీ ఆయన ఇప్పుడు రంగంలోకి దిగి జగన్మోహన్ రెడ్డి గౌరవించారని చెప్పడం కూడా కొత్త వివాదానికి దారితీసింది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియా ఏకంగా రాజమౌళి పాత వీడియోలను బయటకు తీసింది. వైసిపి హయాంలో సీఎం చర్యలను రాజమౌళి పొగిడిన వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వారిని పొగడడం సినిమా వారి వంతు. అది జగమెరిగిన సత్యం కూడా. అయితే తనపై సినీ రంగం నుంచి వచ్చిన ముద్రను.. వారితోనే చెరిపేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే కొత్త కొత్త ప్రముఖులు ఇప్పుడు తెరపైకి వచ్చి.. పొగడ్తలు ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు మరింత మంది మీడియా ముందుకు వచ్చి జగన్ గొప్పతనాన్ని చాటి చెబుతారని తెలుస్తోంది.