Peddireddi Ramachandra Reddy : వైఎస్సార్ సీపీ పాలనలో జరిగిన అక్రమాలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కూపీ లాగుతోంది. ముఖ్యంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని సాగించిన అరాచకాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టిసారించారు. ఈ క్రమంలో ఇటీవలే చిత్తూరు జిల్లాలోని అడవి ప్రాంతంలో పర్యటించారు. ఎర్రచందనం డిపోలను తనిఖీ చేశారు. అడవిలో భూములను పరిశీలించారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం మంగళంపేటలోని అటవీ భూముల వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కఠిన వైఖరి ప్రదర్శించారు. అటవీశాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్న 104 ఎకరాల భూములపై ఉన్నతాధికారులతో బుధవారం(నవంబర్ 12న)టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. భూమి ఎలా వారసత్వంగా మారిందన్నది, ఏ దశలో ఎవరి పాత్ర ఎంతుందన్న అంశాలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు.
సర్వే నంబర్లలో తేడాలు..
మంగళంపేట గ్రామంలోని సర్వే నంబర్లు 295, 296లలో అటవీ భూముల విస్తీర్ణంపై స్పష్టత అవసరమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రికార్డుల్లో విస్తీర్ణం మారుతున్నట్లు కనబడటం, సబ్ డివిజన్ ప్రక్రియ ద్వారా భూమి సంఖ్యలు పెరిగినట్లు ఆధారాలు వెల్లడిస్తున్నాయని పరిశీలనలో తేలిందని చెప్పారు. రక్షిత అటవీ ప్రాంతాల్లో ఎస్టేట్లు నిర్మించిన వారిని ఎవరయినా విడిచిపెట్టొద్దని ఉప ముఖ్యమంత్రి హెచ్చరించారు. భూములు ఆక్రమించిన వ్యక్తుల వివరాలను అటవీశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని, వారి మీద ఉన్న కేసుల ప్రగతిని ప్రజలకు వెల్లడించాలని ఆదేశించారు.
ఎన్నికల అఫిడవిట్లలో వ్యత్యాసాలపై పోకస్..
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి 2024 ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న అటవీ భూముల విస్తీర్ణానికి వ్యతిరేకంగా కొత్త వివరాలు వెలుగులోకి వస్తున్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం 40.80 ఎకరాలు చూపిస్తే, వెబ్‌బ్యాండ్లో 77.54 ఎకరాలు నమోదు ఎలా అయ్యాయని ప్రశ్నించారు. ఈ వ్యత్యాసం ఎలా వచ్చిందో తేల్చాలని ఆదేశాలు జారీ చేశారు.
విజిలెన్స్ విభాగం ఇప్పటికే మంగళంపేట భూములపై పూర్తిస్థాయి సమాచారం సమర్పించిందని, ఆ నివేదికే భవిష్యత్తు చర్యలకు పునాదిగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అటవీశాఖ అధికారులు విషయాన్ని పారదర్శకంగా పరిశీలించి ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని సూచించారు.