Andhra Pradesh new districts : ఏపీలో కొత్త జిల్లాల ప్రకటన వస్తుందా? సంక్రాంతి నాటికి ప్రకటించే అవకాశం ఉందా? ఇప్పటికే నిర్ణయం జరిగిపోయిందా? నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. రెవెన్యూ డివిజన్లతో పాటు మండలాలు కూడా ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఈ మేరకు జిల్లాల ఏర్పాటుతోపాటు చేర్పులు మార్పులకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం ఈ విషయంలో వినతులు స్వీకరించారు. వీటన్నింటినీ క్రోడీకరించి కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
* ప్రతిపాదనలు సిద్ధం..
ప్రస్తుతం ఏపీవ్యాప్తంగా 26 జిల్లాలు ఉన్నాయి. మరో ఆరు లేదా నాలుగు జిల్లాలు ఏర్పాటు ఖాయమని తెలుస్తోంది. ప్రధానంగా మార్కాపురం( Markapuram), అమరావతి, మదనపల్లి తో పాటు మరో ఏజెన్సీ జిల్లా ఏర్పాటు కావడం ఖాయమని సమాచారం. పలాస జిల్లా కేంద్రంగా చేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. వీటికి తుది రూపు ఇచ్చేందుకు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదముద్రవేసే అవకాశం ఉంది. అటు తరువాత ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం గెజిట్ విడుదల చేస్తారు. త్వరలో జనగణన ప్రారంభం కానున్న నేపథ్యంలో.. డిసెంబర్ 31 లోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* మార్కాపురం ఖాయం..
ప్రధానంగా మార్కాపురం జిల్లా ఏర్పాటు ఖాయమని తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని( Prakasam district ) కనిగిరి, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజక వర్గాలతో ఈ కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలతో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉంది. అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉంది. అద్దంకి, మడకశిర సహా పది కొత్త రెవిన్యూ డివిజన్ల ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు ఉన్నాయి.
* రెవెన్యూ డివిజన్లు సైతం..
వైసిపి హయాంలో 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అప్పట్లో హేతుబద్ధత పాటించలేదు. దీనికి తోడు ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో మండలం చేరో రెవెన్యూ డివిజన్లో చేర్చారు. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయితున్నాయి. పాలన సౌలభ్యం మేరకు ఒకే నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలను ఒకే రెవెన్యూ డివిజన్ కిందకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు శృంగవరపుకోట నియోజకవర్గం విజయనగరం నుంచి విశాఖ జిల్లా కుమార్చాలాన్న ప్రతిపాదన కూడా ఉంది. వీటన్నింటిపై నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సంక్రాంతి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.