Monsoon Update AP: ఆంధ్రప్రదేశ్లో వాతావరణంలో మార్పులు కనిపించాయి. చల్లటి వాతావరణం ప్రారంభమైంది. ద్రోణి ప్రభావం ఏపీ పై ఉంది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు కోస్తాంధ్రతో పాటు తిరుపతి, చిత్తూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి, కడప, అన్నమయ్య జిల్లాలకు సైతం వర్ష సూచన ఉంది. కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది.
*బలహీనంగా రుతుపవనాలు..
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. కానీ బలహీనంగా ఉన్నాయి. ఈనెల 23 తర్వాత బలం పుంజుకునే అవకాశం ఉంది. ఈ నెలాఖరు నాటికి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే ఛాన్స్ కనిపిస్తోంది. అప్పటివరకు మాత్రం తేలికపాటి వర్షాలకి అవకాశం ఉంది. బుధవారం రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో మాత్రం వర్షాలు పడ్డాయి. విజయనగరం జిల్లా వేపాడలో 9.67 సెంటీమీటర్లు, శ్రీ సత్య సాయి జిల్లా బుక్క సముద్రంలో 6.9, నర్సీపట్నంలో 6.65, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో 6.58, ప్రకాశం జిల్లా టంగుటూరులో 6.44 వర్షపాతం నమోదయింది. అనకాపల్లి జిల్లాలో 5.77 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం విశేషం. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో సైతం వానలు పడ్డాయి.
* రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
మరోవైపు రాయలసీమలో మాత్రం ఎండల తీవ్రత కొనసాగింది. కొన్నిచోట్ల అయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బాపట్లలో అత్యధికంగా 42.5 డిగ్రీలు, పల్నాడు జిల్లా జంగమహేశ్వరపురం, నెల్లూరు జిల్లా కావలి, ప్రకాశం జిల్లా ఒంగోలులో 42, అమరావతిలో 41.5, నెల్లూరులో 40.9, గన్నవరంలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే వర్షం పడుతున్న ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడుతున్నాయి. భారీ ఈదురు గాలులు వీస్తున్నాయి. అందుకే ప్రజలు చెట్లు, స్తంభాలు, హోర్టింగుల వద్ద నిల్చో వద్దు అని విపత్తుల నిర్వహణ సంస్థ సూచిస్తోంది
