Minister Nara Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్( Nara Lokesh) ఎంతో పరిణితి సాధిస్తున్నారు. చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి విషయంలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అది తప్పు అని నేరుగా తమ వారినే హెచ్చరించారు. ఇది మాత్రం చాలా గొప్ప విషయం. రాజకీయాల్లోకి సోషల్ మీడియా వచ్చాక వ్యతిరేక ప్రచారం అనేది పరిధి దాటిపోయింది. వ్యక్తిగత విమర్శలు దాటి వ్యక్తిత్వ హననం వరకు వచ్చింది. ప్రత్యర్థిని దారుణంగా తిట్టడం.. వారి గురించి తప్పుగా చూపించడం.. చివరకు కుటుంబంలోని మహిళలను సైతం కించపరిచేలా పోస్టులు పెట్టడం అనేది సర్వసాధారణంగా మారింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అది మరింతగా పెరిగింది. దానికి ప్రధాన బాధితుడు లోకేష్. కానీ ఇప్పుడు సొంత సోషల్ మీడియా తన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డిని అలానే చూపించే ప్రయత్నం చేయగా.. వద్దని వారించారు మంత్రి లోకేష్. వ్యక్తిత్వ హననం వద్దని గట్టి హెచ్చరికలే పంపారు. తద్వారా తనలో పరిణితి పెరిగిందని చెప్పకనే చెప్పారు లోకేష్. రాజకీయాల్లో ఇది గొప్ప విషయం కూడా. లోకేష్ మున్ముందు ఇలానే ప్రవర్తిస్తే మాత్రం ఆయనను అవమానించిన వారు సైతం సిగ్గుపడడం ఖాయం.
* అన్ని విధాలా బాధితుడు ఆయనే..
అయితే రాజకీయాల్లో ప్రత్యర్థులను టార్గెట్ చేయడం అనేది సర్వసాధారణం కానీ. లోకేష్ విషయంలో దారుణంగా వ్యతిరేక ప్రచారం చేశారు. చివరకు ఆయన శరీర ఆకృతిపై కూడా దారుణంగా ట్రోల్స్ వేశారు. ఆయన హావభావాలతో పాటు భాష పై సైతం నిత్యం వ్యతిరేకంగానే ప్రచారం చేసేవారు. నిండు సభలో ఆయన తల్లిని అగౌరవపరిచారు. ఆయన తండ్రి సీఎం చంద్రబాబు( CM Chandrababu) దుఃఖపడేలా వ్యవహరించారు. అయితే రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తు.. విమర్శకు ప్రతి విమర్శ.. దాడికి ప్రతి దాడి అనేది సమాధానం. ఈ విషయంలో మాత్రం మంత్రి లోకేష్ పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో తప్పు చేసిన వారిని చట్టపరంగా దండిస్తున్నారు. కానీ వ్యక్తిత్వ హననానికి మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు.
* ఖండించిన లోకేష్..
నిన్ననే టిడిపి సోషల్ మీడియాలో( social media) ఒక ఫోటో వైరల్ అయింది. చంద్రబాబు, పవన్, లోకేష్ చాలా రిచ్ గా రోడ్డుపై వెళ్తుంటే.. పక్కనే బిచ్చగాడి మాదిరిగా ప్రత్యేక హోదా అడుగుతున్నట్టు చూపిస్తూ ఒక కార్టూన్ చిత్రం వెలుగులోకి వచ్చింది. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అది తప్పు అని ఖండించారు. అటువంటి ప్రచారం చేయవద్దని సొంత సోషల్ మీడియాను సూచించారు. వ్యక్తిత్వ హననానికి మించి అణచివేత ఉండదని.. దానికి ఎవరు బాధితులుగా మిగిలిన ఆ బాధ తట్టుకోలేనిది అని లోకేష్ చెప్పారంటే ఆయన ఎంత పెయిన్ అనుభవించారో అర్థం అవుతోంది. గతంలో ఆయన విషయంలో వైసీపీ నేతల దాడి ఎలా ఉంటుందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని.. ఇలా చెప్పుకుంటూ పోతే లోకేష్ పై విమర్శలు చేయని నోరు లేదు.. తక్కువ చేసి మాట్లాడిన నేతాలేరు. కానీ అవేవీ పట్టించుకోకుండా లోకేష్ వ్యక్తిత్వ హననం వద్దు అని చెప్పడం మాత్రం నిజంగా అభినందించదగ్గ విషయం.