Minister Kondapalli Srinivas : వైసీపీ సీనియర్ నేత బొత్స కు ఓ మంత్రి పాదాభివందనం చేశారా? ఎందుకు చేశారు? ఏ సందర్భంలో చేశారు? ఆ వార్తల్లో నిజం ఎంత? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో ఆసక్తికర చర్చ. విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కాళ్లకు నమస్కరించారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. ఎన్నికల్లో బొత్స సోదరుడు అప్పల నరసయ్య పై గెలిచారు శ్రీనివాస్. అనూహ్యంగా ఆయనకు మంత్రి పదవి లభించింది. అయితే జిల్లాలో బొత్స హవా ఇప్పటికీ కొనసాగుతోందని.. ఆయనను కొండపల్లి శ్రీనివాస్ డామినేట్ చేయలేకపోతున్నారన్నది ఒక ప్రచారం అయితే ఉంది. ఇలాంటి సమయంలో విశాఖ ఎయిర్పోర్టులో తనకు ఎదురుపడిన బొత్స కాళ్లకు కొండపల్లి శ్రీనివాస్ నమస్కరించారు అన్నది ఈ వార్త సారాంశం. గత సంబంధాల నేపథ్యంలోనే అలా కొండపల్లి శ్రీనివాస్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. తాజాగా ఈ అంశంపై స్పందించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్.
* సుదీర్ఘ రాజకీయ నేపథ్యం
కొండపల్లి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. కొండపల్లి శ్రీనివాస్ తాత కొండపల్లి పైడితల్లి నాయుడు ఎంపీగా రెండుసార్లు గెలిచారు. అది కూడాబొత్స సత్యనారాయణ పైనే విజయం సాధించారు. 1996లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బొత్స వర్సెస్ కొండపల్లి పైడితల్లి నాయుడు అన్నట్టు పరిస్థితి ఉండేది. 1999 లో సైతం ఎంపి అయ్యారు. 2004లో ఎంపీగా గెలిచిన పైడితల్లి నాయుడు ప్రమాణ స్వీకారం చేయకుండానే మరణించారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి బొబ్బిలి ఎంపీగా గెలిచారు.
* రెండు కుటుంబాల మధ్య పోరు
నియోజకవర్గాల పునర్విభజన తర్వాత గజపతినగరం నుంచి ముఖాముఖిగా తలపడుతున్నారు బొత్స, కొండపల్లి కుటుంబ సభ్యులు. మొత్తం నాలుగు సార్లు ఎన్నికలు జరగగా.. బొత్స సత్యనారాయణ సోదరుడు అప్పల నరసయ్య రెండుసార్లు.. కొండపల్లి అప్పలనాయుడు ఒకసారి, కొండపల్లి శ్రీనివాస్ తాజాగా ఆ నియోజకవర్గం నుంచి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టికెట్ కోసం పట్టుపట్టారు కొండపల్లి పైడితల్లి నాయుడు కుమారుడు కొండలరావు. అయితే పార్టీ హై కమాండ్ కొండపల్లి అప్పలనాయుడు టికెట్ ఇవ్వడంతో కొండలరావు వైసీపీలో చేరారు. దీంతో బొత్సతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. వాటినే గుర్తుచేసుకొని కొండలరావు కుమారుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా బొత్స సత్యనారాయణకు పాదాభివందనం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఖండించారు. ఇది రాజకీయ ప్రత్యర్థులతో పాటు వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం అని.. తన ఎదుగుదలను చూసి తట్టుకోలేక అలా చేస్తున్నారని మండిపడ్డారు.