AP Mega DSC 2025: ఏపీలో( Andhra Pradesh) మెగా డీఎస్సి కి సంబంధించి తుది జాబితాను ప్రకటించారు. వెబ్సైట్లో అందుబాటులోకి తెచ్చారు. ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న అభ్యర్థులకు ఇది అత్యంత శుభదినం కూడా. తాము ఉపాధ్యాయులం అయ్యామన్న భావన కలిగిన రోజు. అయితే మెగా డీఎస్సీ ఇంత వేగంగా పూర్తవుతుందని ఎవరు ఊహించలేదు. గతంలో మాదిరిగా సుదీర్ఘకాలం కొనసాగుతుందని అంతా భావించారు. కానీ కూటమి తన ఏడాది పాలనలోనే డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి.. ఉపాధ్యాయులను పాఠశాలల్లో నియమించేందుకు చర్యలు తీసుకోవడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. అయితే ఈ విషయంలో క్రెడిట్ మాత్రం మంత్రి నారా లోకేష్ దే. ఎందుకంటే విద్యాశాఖ మంత్రిగా ఆయన చొరవతోనే డీఎస్సీని ఇంత సులువుగా పూర్తి చేయగలిగారు.
అనుకున్న గడువులోగా..
ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ( DSc notification) ఈ ఏడాది ఏప్రిల్ 20న జారీ అయ్యింది. అంటే సరిగ్గా ఆరు నెలల వ్యవధి కాకమునుపే ఉపాధ్యాయ నియామకాలు పూర్తిచేసిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా నారా లోకేష్ డీఎస్సీ ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్లారు. కీలక పాత్ర పోషించారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల సమయంలో మాజీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయితే.. ఇన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తమకు తెలియదని.. ఎలా భర్తీ చేస్తారని సందేహం వ్యక్తం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన 6000 పోస్టులకు.. మరో 10 వేలకు పైగా పోస్టులను కలుపుతూ మెగా డీఎస్సీ ని ప్రకటించింది కూటమి ప్రభుత్వం. ఏడాది కాలంలోనే డీఎస్సీ ప్రక్రియను పూర్తి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకుంది.
అమలు కాని జగన్ హామీ..
వాస్తవానికి ఏటా మెగా డీఎస్సీ ప్రకటిస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) పాదయాత్రలో హామీ ఇచ్చారు. నవరత్నాల్లో కూడా పేర్కొన్నారు. కానీ ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదు. చివరిగా 2024 ఎన్నికలకు ముందు ఓ 6 వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటన చేశారు. అయితే అక్కడికి రోజుల వ్యవధిలోనే సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీంతో ఆ డీఎస్సీ ముందుకు కదల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధ్యాయ నియామక బాధ్యతను తనపై వేసుకున్నారు మంత్రి నారా లోకేష్. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఖాళీలను భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. హామీ ఇచ్చినట్లుగా మెగా డీఎస్సీ నిర్వహించారు. అయితే అడ్డుకునేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వదులుకొద్ది పిటిషన్లు కోర్టులో వేయించారు. చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయితే పూర్తి నియమ నిబంధనలతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో వారి పాచిక పారలేదు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను అడ్డుకునేందుకు నారా లోకేష్ సమర్ధవంతమైన న్యాయ బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఫలితంగా ఎటువంటి సమస్య లేకుండా 16 వేల మందికి పైగా ఉపాధ్యాయ పోస్టులు లభించాయి. అందరి కళ్ళల్లో ఇప్పుడు ఆనందం కనిపిస్తోంది. అయితే ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయ సంఘాల్లో ఇప్పుడు లోకేష్ పని తీరుపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. నిజంగా ఏపీ మెగా డీఎస్సీతో లోకేష్ పాత్ర, ఆయన గ్రాఫ్ అమాంతంగా పెరిగింది.