AP Mega DSC: ఏపీలో( Andhra Pradesh) మెగా డీఎస్సీ ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి తుది జాబితాను వెల్లడించిన సంగతి తెలిసిందే. డీఎస్సీ వెబ్సైట్లో ఈ జాబితా అందుబాటులో ఉంది. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చేందుకు కూడా నిర్ణయించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా అమరావతి లోనే ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేసేందుకు నిర్ణయించారు. అయితే ఉన్నఫలంగా కార్యక్రమం వాయిదా పడింది. దీంతో డీఎస్సీ ఎంపికైన అభ్యర్థులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అయితే అది భారీ వర్షాల కారణంగానే వాయిదా పడినట్లు తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన మెగా డీఎస్సీ ప్రక్రియ పూర్తయింది. ఆరు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. అయితే ఇప్పుడు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం వాయిదా పడడం విశేషం.
హామీ ఇచ్చినట్టే..
తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ( DSC) ప్రకటిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఫైల్ పై సంతకం చేశారు సీఎం చంద్రబాబు. ఈ ఏడాది ఏప్రిల్ 20న నోటిఫికేషన్ జారీ చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించారు. జూన్ నుంచి జూలై మధ్య ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. దాదాపు 3 లక్షలకు మందికి పైగా అభ్యర్థులు 5 లక్షలకు పైగా పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా నెల రోజులపాటు ఆన్లైన్లో పరీక్షలు పూర్తి చేసింది విద్యాశాఖ. తొలుత ప్రాథమిక కీ, తరువాత సాధారణ కీ ప్రకటించారు. మెరిట్ లిస్టును ప్రకటించి ధ్రువపత్రాలను పరిశీలించారు. ఆ ప్రక్రియ జరిగిన తరువాత తుది జాబితాను ప్రకటించారు. తుది జాబితాలో చోటు దక్కించుకున్న వారికి అమరావతి వేదికగా నియామక పత్రాలు అందించేందుకు నిర్ణయించారు. కానీ ఈ పంపిణీ ప్రక్రియ వర్షాలు కారణంగా వాయిదా పడింది.
* అసెంబ్లీ సమావేశాలు..
ఈరోజు నుంచి అసెంబ్లీ( assembly sessions ) వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. శాసనసభకు సమీప ప్రాంగణంలో రేపు డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని పండగలా జరపాలని భావించారు. కానీ అకాల వర్షాలు ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతం తడిసిపోయింది. అందుకే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఈనెల 22 నుంచి 29 వరకు ఎంపికైన వారికి ఉపాధ్యాయ శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్ మూడున దసరా సెలవులు అనంతరం పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఆ రోజున కొత్తగా ఉపాధ్యాయులు విధుల్లో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే నియామక పత్రాల పంపిణీ వాయిదా పడడంతో.. నిర్దిష్ట షెడ్యూల్ మేరకు ఈ ప్రక్రియ అంతా జరుగుతుందా? లేదా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.