AP liquor scam: ఏపీలో మద్యం కుంభకోణం( liquor scam) ప్రకంపనలు సృష్టించింది. దీని మూలాలు విదేశాల్లో ఇప్పుడు వెలుగు చూడడం సంచలనంగా మారింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన ముడుపుల సొత్తు విదేశాలకు తరలించినట్లు ఈడి గుర్తించింది. వైసిపి హయాంలో జరిగిన భారీ మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 29 మంది పై కేసు నమోదు కాగా.. ఓ 12 మంది అరెస్ట్ అయ్యారు కూడా. ఈ కేసులో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి తొలుత అరెస్టయ్యారు. చివరిగా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. మరోవైపు ఈ కేసులో బెయిల్ పై విడుదలకు నిందితులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రత్యేక దర్యాప్తు బృందం లోతైన విచారణ చేపడుతోంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. దేశంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. ఇంకో వైపు ఈ మద్యం కుంభకోణం మూలాలు విదేశాల్లో ఉన్నట్లు కూడా గుర్తించింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది.
ఈడి డొంక లాగితే..
మద్యం కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team) 29 మంది నిందితులపై కేసు నమోదు చేసింది. అయితే తాజాగా ఈ కేసులో ఏ 9 గా ఉన్న తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో సహా మరికొందరి నిందితులకు భారీగా మద్యం ముడుపుల సొమ్ము చేరినట్లు గుర్తించింది ఈడి. పలు డొల్ల కంపెనీల ప్రతినిధులతో వారు చేసిన వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్ వివరాలు ఈడీకి లభ్యమైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట ఈడీ ఏకకాలంలో దేశంలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన లావాదేవీల ఆధారాలు లభ్యం కాగా.. వాటి వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు ఈడి అధికారులు.
Also Read: వైసీపీకి ఆ ఎమ్మెల్యే షాక్ ఇస్తారా?
బైర్లు కమ్మేలా నిజాలు
ఈడీ ( enforcement director rate )తనిఖీల్లో బైర్లు కమ్మే నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది. ఒక పద్ధతి ప్రకారం ఈ ముడుపులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. డిస్టలరీలు, మద్యం సరఫరా చేసే కంపెనీల యజమానులు.. ముడుపుల సొత్తును బంగారు దుకాణాలు, ప్యాకేజింగ్ సంస్థలు, డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్ళించేవారు. వారి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అందజేసేవారు. అంటే వైట్ మనీని బ్లాక్ మనీ గా మార్చేవారు అన్నమాట. ఎందుకుగాను కొన్ని విదేశీ సంస్థలు, కార్యాలయాల లావాదేవీలను వాడుకునేవారు. ఈ ముడుపుల సొమ్మును తరలించేందుకు ఉపయోగించిన వాహనాల నకిలీ ట్రాన్స్పోర్ట్ చలానాలు కూడా ఈడి చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే మద్యం కుంభకోణం మూలాలు ఇప్పుడు విదేశాల్లో తేలడం కూడా సంచలనంగా మారింది.