AP Liquor Scam Case Updates: ఏపీ లిక్కర్ కుంభకోణంలో కీలక పరిణామం. వైసిపి హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందని కూటమి ప్రభుత్వం అనుమానించింది. దీనిపై దర్యాప్తునకు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించింది. లోతైన దర్యాప్తుతో సిట్ దూసుకుపోతోంది. 29 మందిపై కేసు నమోదు చేయగా.. 12 మందిని అరెస్టు చేసింది. అయితే ఓ నలుగురు బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఈరోజు ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి బెయిల్ లభించింది. మంగళవారం ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది. చాలాసార్లు ఆయన బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కానీ కోర్టులో చుక్కెదురు అవుతూ వచ్చింది. తాజాగా ఆయనకు బెయిల్ లభించడం విశేషం.
A4 గా మిథున్ రెడ్డి..
ఏపీ మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఏ 4 గా ఉన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఈ ఏడాది జూలై 19న ఆయన అరెస్టు జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దాదాపు 71 రోజులుగా జైల్లోనే గడుపుతున్నారు. బెయిల్ కోసం ఆయన పలుసార్లు దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం తిరస్కరిస్తూ వచ్చింది. సెప్టెంబర్ 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మిధున్ రెడ్డి నాలుగు రోజులపాటు తాత్కాలిక బెయిల్ అడిగారు. అందుకు కోర్టు అంగీకరించింది. తిరిగి ఆయన కస్టడీకి వచ్చేసారు. తాజాగా మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రెండు లక్షల షూరిటీ, వారానికి రెండుసార్లు సంతకం సహా షరతులతో కూడిన బెయిల్ లభించింది. దీంతో మిధున్ రెడ్డి మంగళవారం విడుదలయ్యే అవకాశం ఉంది.
ఐదుగురికి బెయిల్..
లిక్కర్ స్కామ్ లో 29 మంది పై కేసులు నమోదయ్యాయి. 12 మంది అరెస్ట్ కూడా జరిగింది. కేసులో సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి తొలుత అరెస్టు అయ్యారు. చివరిసారిగా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టు జరిగింది. అయితే ఇప్పటికే వైసిపి హయాంలో సీఎమ్ఓ అధికారిగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి, అప్పటి ఓ ఎస్ డి కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలకు బెయిల్ లభించింది. వారు జైలు నుంచి విడుదలయ్యారు కూడా. తాజాగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి బెయిల్ లభించడంతో.. ఆ సంఖ్య ఐదుకు చేరుకుంది. మరోవైపు లిక్కర్ కేసులో పరారీలో ఉన్న నిందితులకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది విజయవాడ ఏసిబి కోర్టు.