AP Liquer Scame : మద్యం కుంభకోణంలో అంతిమ ఘట్టం ప్రారంభమైందా? ‘అంతిమ లబ్ధిదారుడు’ ఎవరన్నది తేలిపోనుందా? అసలు సిసలైన అంకం మొదలైందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో లిక్కర్ స్కాం సంచలనం రేపుతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సీఐడీతో పాటు పోలీసులు రంగంలోకి కీలక ఆధారాలు సేకరించారు. దీంతో భారీగా అవినీతి జరిగిందని.. అవినీతి సొమ్మును హవాలా రూపంలో విదేశాలకు తరలించేశారని విచారణలో తేలింది. మరోవైపు ఇదే కేసులో ఏ5 నిందితుడుగా ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని తేల్చేశారు. అవసరమైతే విచారణకు పిలిస్తే మరిన్ని ఆధారాలు ఇస్తానని చెప్పుకొచ్చారు. దీంతో ప్రత్యేక నోటీసు ఇచ్చిన సిట్ విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా విచారించింది. ఆయన వాంగ్మూలాన్ని సేకరించింది. అటు తరువాతే వరుసగా అరెస్టులు ప్రారంభమయ్యాయి. అప్పటి సీఎంవో అధికారి, ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ క్రిష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పబాలాజీలను అరెస్టు చేశారు. ఇప్పుడు ఆ నలుగుర్ని కోర్టు అనుమతి మేరకు కస్టడీలోకి తీసుకుంది సిట్. దీంతో అంతిమ లబ్దిదారుడు ఎవరన్నది తేలిపోనుంది.
ఆ నలుగురే కీలకం..
వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో పేరుకే కేబినెట్, పేరుకే ప్రజాప్రతినిధులు అన్నట్టు పరిస్థితి ఉండేది. మొత్తం వ్యవహారాలన్ని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా ఉన్న ధనుంజయరెడ్డి చూసేవారు. ఆయన కనుసన్నల్లోనే ప్రభుత్వ పాలన, వైసీపీ వ్యవహారాలన్నీ జరిగేవన్న విమర్శలున్నాయి. ఎన్నికల ఫలితాలు అనంతరం ఎక్కువ మంది వైసీపీ నేతలు నిందించింది ధనుంజయరెడ్డినే. మరోవైపు జగన్ ఓఎస్డీగా పని చేసి క్రిష్ణమోహన్ రెడ్డికి సైతం ఇందులో పాత్ర ఉందని తేలింది. మరోవైపు భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గా ఉన్నారు గోవిందప్ప బాలాజీ. ఈయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడు. రాజ్ కసిరెడ్డి గురించి చెప్పనవసరం లేదు. 2019 ఎన్నికల్లో జనసేన తరుపున పోటీచేసి ఓడిపోయారు. ఫలితాలు వచ్చిన తరువాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అటు తరువాత ఐటీ సలహదారుడుగా పదవి పొందారు. అప్పుడే లిక్కర్ స్కాంను రూపొందించడంలో ఈయనదే కీలక పాత్ర అని తేలిది. ఇప్పుడు ఈ నలుగురు సిట్ కస్టడీలోకి రావడంతో కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అంతిమ లబ్దిదారుడు ఎవరనేది తేలనుంది.
Also Read : సంచలనం.. ఏపీ సీఎం జగన్ కజిన్ అరెస్ట్.. అసలేం జరిగింది?
హైదరాబాద్ కేంద్రంగా వ్యవహారాలు..
వీరంతా మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వ మద్యం దుకణాలకు మద్యం సరఫరా చేసే సంస్థల నుంచి భారీగా ముడుపులు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇందులో రాజ్ కసిరెడ్డి అసలు సూత్రధారిగా విచారణలో తేలినట్టు సమాచారం. మద్యం సరఫరా చేసే కంపెనీల నుంచి ..ప్రతి సీసాకు రూ.50 వరకూ కమీషన్ ఇవ్వాలని ప్రతిపాదన చేసి అమలుచేసింది ఈయనేనన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిపాదన రావడంతో ప్రీమియం మద్యం బ్రాండ్ల కంపెనీలన్నీ పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తోంది. అటు డిస్టలరీను బెదిరించి బలవంతంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి స్వాధీనం చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. తరచూ వీరంతా మద్యం సరఫరాదారులతో సమావేశమయ్యేవారని సిట్ గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే అంతిమ లబ్దిదారుడు, బిగ్ బాస్ ఎవరనేది లక్ష్యంగా సిట్ విచారణ జరపనున్నట్టు సమాచారం.
రెండురోజుల పాటు విచారణ…
ఈరోజు, రేపు వీరికి సిట్ విచారణ చేపట్టనుంది. ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్ర 6 గంటల వరకూ వీరికి విచారించనునుంది. అందులో భాగంగా సిట్ అధికారులు ఈ రోజు ఉదయం విజయవాడ జిల్లా జైలుకు వెళ్లి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈ పరిణామాలతో వైసీపీ బ్యాచ్ తీవ్ర ఆందోళనలో ఉంది. ఇప్పటికే తనను అరెస్టు చేసుకోవచ్చని.. విజయవాడలో ఉంటానని.. తనకు జైళ్లు కొత్తకావని జగన్మోహన్ రెడ్డి సవాల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు రోజుల సిట్ విచారణలో ఆ నలుగురు ఏం చెబుతారు? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనన్న ఆందోళన వైసీపీ శ్రేణులను వెంటాడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.