AP Latest Political News: ఏపీలో( Andhra Pradesh) బిజెపి ప్లాన్ ఏంటి? ఆ పార్టీ బలోపేతంపై తీసుకుంటున్న చర్యలేంటి? మిత్రపక్షంగా కొనసాగుతూనే బలపడాలన్న ప్రయత్నం చేస్తుందా? అసలు బిజెపి బలపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇవే పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఈరోజు విజయవాడలో బిజెపి కీలక సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు పాల్గొన్నారు. ముఖ్య నేతలు హాజరయ్యారు. పార్టీ బలోపేతం పై చర్చించారు. అయితే ఈ ఎన్నికల్లో బిజెపికి ఓట్లు, సీట్లు పెరిగినా ఆశించిన స్థాయిలో మాత్రం ఆ పార్టీ పురోగతి సాధించడం లేదు. ఇంకా టిడిపి నీడలోనే ఏపీలో ఉంది. కనీసం జనసేన మాదిరిగా కూడా వ్యవహరించలేకపోతోంది. దీనిపై ఆ పార్టీ శ్రేణులు కాస్త ఆందోళనతోనే ఉన్నాయి.
ఎంతోమంది సీనియర్లు..
ఏపీ బీజేపీలో( Bhartiya Janata Party) చాలామంది నేతలు ఉన్నారు. హేమహేమీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఉన్నారు. రాష్ట్రమంత్రిగా సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. ఆపై ఏపీ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన వారు ఉన్నారు. బిజెపి అగ్ర నేతలుగా పురందేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి లాంటి నేతలు కొనసాగుతున్నారు. అయినా సరే బిజెపి పుంజుకోవడం లేదు. బిజెపి కార్యక్రమాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఆ పార్టీలో ఇదే చర్చకు కారణం అవుతోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఆ పార్టీ కార్యక్రమాల్లో వెనుకబాటు కనిపిస్తోంది. తెలంగాణలో ఒంటరి పోరాటంతో ముందంజలో ఉంది బిజెపి. ఇక్కడ మాత్రం పొత్తులో భాగంగా చిన్న పార్టీగా ఉండిపోతుంది.
భారీ అంచనాలు..
వాస్తవానికి ఏపీ బీజేపీ చీఫ్ గా పివిఎన్ మాధవ్( pvn Madhav ) ఎంపికైన తర్వాత దూకుడుగా ముందుకు వెళుతుందని అంతా భావించారు. అంతకుముందు పురందేశ్వరి ఉండేవారు. ఆమె హయాంలో ఎన్నికల్లో మంచి ఫలితాలే వచ్చాయి. పది అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తే ఎనిమిది చోట్ల గెలిచింది ఆ పార్టీ. ఆరు పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తే మూడింట గెలిచింది. ఓట్లతో పాటు సీట్లు వచ్చాయి. అయితే పురందేశ్వరి రాజమండ్రి ఎంపీగా ఉన్నారు. ఆమెను తప్పించి ఆమె స్థానంలో పివిఎన్ మాధవ్ కు ఛాన్స్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో మాధవ్ దూకుడుగా ముందుకెళ్తారని అంతా భావించారు. కానీ ఎందుకు ఆయన ఆశించిన స్థాయిలో పని చేయలేకపోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తగ్గిన విభేదాలు..
ఏపీ బీజేపీలో వర్గ విభేదాలు అంతంత మాత్రమే. గతంలో సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉండే సమయంలో ఒక రకమైన వాతావరణం కనిపించేది. పురందేశ్వరి అధ్యక్షురాలిగా మారిన తర్వాత సోము వీర్రాజు లాంటి నేతలు ఆమెతో విభేదించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాధవ్ అధ్యక్ష స్థానంలోకి రాగా ఆయనకు మిగతా నేతల నుంచి సహకారం అందుతుంది. అయితే ఏపీలో కూటమి కార్యక్రమాలలో కనిపించే మాధవ్.. బిజెపి కార్యక్రమాలు నిర్వర్తించడంలో మాత్రం వెనుకబడ్డారన్న టాక్ వినిపిస్తోంది. అయితే మాధవ్ బ్యాక్ గ్రౌండ్ గొప్పది. ఆపై ఆర్ఎస్ఎస్ వాది. పార్టీకి నమ్మకమైన నేత. అందుకే ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తున్నారని.. ఆయన సక్సెస్ అవుతారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల అణగారిన వర్గాలను బిజెపిని దరి చేర్చేందుకు చాలా కార్యక్రమాలు రూపొందించారని కూడా తెలుస్తోంది. అయితే మున్ముందు పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం వంటి వాటి కోసమే ఈరోజు సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. చూడాలి మరి బీజేపీ ప్రాతినిధ్యం ఎంతవరకు పెరుగుతుందో???