AP Heat Waves: ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్. రాబోయే రెండు మూడు రోజుల్లో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారనుంది. ఎండలు, వేడి గాలుల తీవ్రత మరింత పెరగనుంది. వాతావరణ శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గుల్లో ఉండగా.. మంగళవారం మాత్రం ఉష్ణోగ్రత తీవ్రతరం అవుతుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళొద్దని సూచించింది.
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 63 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే ఛాన్స్ ఉంది పార్వతీపురం మన్యం జిల్లాలో 13 మండలాల్లో, శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాల్లో, విజయనగరం జిల్లాలో 22 మండలాల్లో, అల్లూరి జిల్లాలో మూడు మండలాల్లో, అనకాపల్లి జిల్లాలో నాలుగు మండలాల్లో, కాకినాడ జిల్లాలో మూడు మండలాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో రెండు మండలాల్లో తీవ్రవాడగాలులు వీచే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా లోనే ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
సోమవారం కూడా చాలా జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. 44 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, పాలకొండ, వీరఘట్టంలో 43.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. రాయలసీమలోని నంద్యాల జిల్లా బనగానపల్లెలో 43.3 డిగ్రీలు, అల్లూరి జిల్లా ఎర్రం పేటలో 43.1, పలనాడు జిల్లా విజయపురి, విజయనగరం జిల్లా రాజాంలో 402.8° ఉష్ణోగ్రతలు, అనకాపల్లి గడిరైలో 42.7 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ తెలిపింది.బుధవారం సైతం ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉంటుందని.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాధ్ తెలిపారు.