Amit Shah: బిజెపి అగ్రనేత అమిత్ షా( Amit Shah ) ఏపీకి చేరుకున్నారు. ఈరోజు ఎన్డిఆర్ఎఫ్ రైజింగ్ డే లో పాల్గొనున్నారు. శనివారం రాత్రి విజయవాడ వచ్చిన అమిత్ షా కు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఉండవల్లి లోని సీఎం నివాసానికి అమిత్ షా చేరుకున్నారు. అక్కడ సీఎం చంద్రబాబు తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఈ ముగ్గురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం చంద్రబాబు అమిత్ షా కు ప్రత్యేక విందు ఇచ్చారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సైతం విందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
* రాజకీయంగా ప్రాధాన్యం
సాధారణంగా ప్రధాని మోదీ ( Narendra Modi) పాలనాపరమైన వ్యవహారాలు చూస్తారు. హోం మంత్రి అమిత్ షా మాత్రం రాజకీయపరమైన నిర్ణయాలను చూస్తారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి పార్టీల మధ్య సమన్వయం, వైసిపి అధినేత జగన్ వ్యవహార శైలిపై ఈ ముగ్గురు నేతలు చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా గత ఐదేళ్లుగా విధ్వంసకర పాలన సాగిందని అమిత్ షా దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జగన్ హయాంలో జరిగిన దుబారా ఖర్చులపై అమిత్ షా ఆరా తీసినట్లు సమాచారం.
* అమిత్ షా దృష్టికి పలు సమస్యలు
కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసిపి( YSR Congress ) ఆడుతున్న నాటకాలను సైతం అమిత్ షా దృష్టికి వారు తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి దారి తీసిన పరిస్థితులు.. ప్రభుత్వపరంగా దిద్దుబాటు చర్యల గురించి అమిత్ షాకు వివరించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి మరిన్ని ప్రాజెక్టులు మంజూరు చేయాలని కీలక ప్రతిపాదనలు బిజెపి అగ్రనేత ఎదుట పెట్టినట్లు తెలుస్తోంది. అయితే పేరుకే ఇది అధికారిక కార్యక్రమం కానీ.. రాజకీయపరమైన అంశాలపై చర్చించేందుకే అమిత్ షా ఏపీ పర్యటనకు వచ్చినట్లు తెలుస్తోంది.
* నేడు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం
కాగా ఈరోజు ఉదయం 11:30 గంటలకు కృష్ణాజిల్లా( Krishna district) గన్నవరం మండలం కొండపావులూరు కు అమిత్ షా చేరుకుంటారు. చంద్రబాబు ఇచ్చిన విందు అనంతరం ఆయన విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్ లో బసచేశారు. హోటల్ నుంచి నేరుగా కొండపావులూరు కు చేరుకోనున్న హోంమంత్రి.. అక్కడ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 10వ బెటాలియన్ కార్యాలయం కొత్త క్యాంపస్, నేషనల్ ఇనిస్టిట్యూట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ ను ప్రారంభిస్తారు. ఇదే సమయంలో రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మొత్తానికైతే కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ కు 11,400 కోట్ల సాయం ప్రకటించిన తర్వాత.. అమిత్ షా ఏపీకి వస్తుండడంపై బిజెపి నేతల్లో ఒక రకమైన ఆనందం వెల్లివిరిసింది.