Homeఆంధ్రప్రదేశ్‌CID cases : ఆ కేసులు సిఐడి కి అప్పగించడం వెనుక స్కెచ్ అదా?

CID cases : ఆ కేసులు సిఐడి కి అప్పగించడం వెనుక స్కెచ్ అదా?

CID cases  :ఏపీలో గత ఐదేళ్ల వైసిపి పాలనలో జరిగిన విధ్వంసాలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుల్లో కదలిక వచ్చింది. దర్యాప్తు ప్రారంభం అయ్యింది. కానీ ఆశించిన స్థాయిలో ఈ దర్యాప్తు ముందుకు సాగలేదు. దానికి కారణం ప్రతి కేసులో అప్పటి పోలీస్ బాసులు ఉండడమే కారణం. వారి విషయంలోపోలీస్ శాఖలో ఒక రకమైన ఉదాసీనత ఉండేది.పైగా సాటి అధికారులు కావడం దర్యాప్తుపై ప్రభావం చూపింది. కూటమి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా.. ఈ కేసులు ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేదు. పైగా ఈ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు న్యాయస్థానాలకు వెళ్లి ముందస్తు బెయల్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుత దర్యాప్తు అధికారుల సహకారం లేనిదే.. అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీస్ అధికారులు బయటపడే మార్గం లేదు. కానీ వారికి న్యాయస్థానాలు ముందస్తు బెయిల్ ఇస్తున్నాయి. దీంతో ప్రభుత్వంలో ఒక రకమైన అనుమానం ప్రారంభం అయ్యింది. అందులో భాగంగానే కీలకమైన నాలుగు కేసులను సిఐడికి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో రెండు ప్రధాన రాజకీయ దాడులు, ముంబై నటి కాదంబరి జెత్వాని కేసుల విషయంలో సమగ్ర విచారణ అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకే వీటిని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి)కు బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుల్లో అప్పటి పోలీస్ అధికారులు అభియోగాలు ఎదుర్కోవడం, నిందితుల్లో కొందరు ఇతర రాష్ట్రాలకు పారిపోయిన నేపథ్యంలో సిఐడి కి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది.
* 2021 సెప్టెంబర్ 17న గుంటూరు జిల్లా తాడేపల్లి లో.. ఉండవల్లి కరకట్ట వద్ద చంద్రబాబు నివాసం పై వైసీపీ నేత జోగి రమేష్ తన అనుచరులతో దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే అప్పట్లో వైసీపీ శ్రేణులతో పాటు టిడిపి నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. వైసీపీ నేతలపై అప్పటి పోలీస్ అధికారులు చిన్నపాటి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో టిడిపి శ్రేణులపై మాత్రం కఠిన చర్యలకు దిగారు.
* అదే ఏడాది అక్టోబర్ 19న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ ఘటనలో సుమారు 70 మందికి పైగా వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. కేసు విచారణలో మాత్రం ముందడుగు పడలేదు.
* ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులతో వేధించారు. రిమాండ్ కు సైతం తరలించారు. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం తో పాటు పోలీస్ అధికారుల పాత్ర బయటపడింది. అయితే ఇప్పటివరకు జరిగిన విచారణలో ఆశించిన స్థాయిలో ముందడుగు పడలేదు.

* విచారణ వేగవంతానికి
అయితే ఈ కేసులను సిఐడి కి అప్పగించడంలో ప్రధాన ఉద్దేశం విచారణను వేగవంతం చేయడం. ఇప్పటికే మంగళగిరి, తాడేపల్లి పోలీసులు విచారణ చేపడుతున్నారు. కానీ విచారణ అధికారులు.. అభియోగాలు ఎదుర్కొంటున్న వారితో సమానమైన క్యాడర్లో ఉండడం.. గతంలో కలిసి పనిచేయడం… ఆ ప్రభావం విచారణపై పడుతుండడంతోనే సిఐడి కి ప్రభుత్వం అప్పగించినట్లు తెలుస్తోంది. సిఐడి అధికారులకు ఉన్న విస్తృత అధికారాలతో నిందితుల అరెస్టుకు అవకాశం ఇవ్వాలని భావిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సాధారణ పోలీసులు జరిపిన విచారణ నివేదికను సిఐడి కి అప్పగించనున్నారు. మొత్తానికి అయితే ఏపీ పోలీసుల నుంచి ఈ కేసులకు విముక్తి లభించడం.. సిఐడి కి అప్పగించడం ద్వారా నిందితులపై ఉక్కు పాదం మోపుతారన్న చర్చ.. ఏపీ పోలీసు వర్గాల నుంచి వినిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular