https://oktelugu.com/

AP Govt : జగన్ శాఖల విభజనకు కూటమి ప్రభుత్వం చెక్.. సంచలన నిర్ణయం.. డిజిపి ఆదేశాలు*

జగన్ సర్కార్ నిర్వాకాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. పాలనాపరమైన ఇబ్బందులు అధిగమించాలని భావిస్తోంది. అందులో భాగంగాఎక్సైజ్ శాఖను వేరు చేస్తూ.. ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని రద్దు చేసింది.

Written By:
  • Dharma
  • , Updated On : September 12, 2024 / 10:57 AM IST

    AP Government

    Follow us on

    AP Govt : ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరోను రద్దు చేసింది. ఆ విభాగాన్ని రద్దుచేసిఎక్సైజ్ శాఖలో విలీనం చేసింది. ఈ మేరకు రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు ప్రత్యేక ఉత్తర్వులు జారీచేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపేందుకు నిర్ణయించింది. ఈ షాపుల నిర్వహణ బాధ్యతను ఎక్సైజ్ శాఖకు అప్పగించింది. మద్యం అక్రమ రవాణా, నిషేధిత వస్తువుల నియంత్రణ బాధ్యతలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోకు అప్పగించింది. అప్పటికప్పుడు ఎక్సైజ్ శాఖను విభజించి.. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రకటించింది. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం మంది అధికారులు, సిబ్బందిని బదలాయించింది. అయితే ఇప్పుడు అదే ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఎక్సైజ్ శాఖలోకి విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. తక్షణం ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని డీజీపీ స్పష్టం చేశారు.

    * మంత్రివర్గం నిర్ణయం
    కొద్దిరోజుల కిందట సమావేశమైన మంత్రివర్గం సెబ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏకంగా డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు. తాజా నిర్ణయంతో దాదాపు 3400 మంది స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది మాతృ సంస్థ అయిన ఎక్సైజ్ శాఖలోకి రానున్నారు. ఆ శాఖకు సంబంధించి వాహనాలు, కంప్యూటర్లు, ఇతర పరికరాలు సైతం ఎక్సైజ్ శాఖకు అప్పగించాలని డిజిపి ఆదేశాలు జారీ చేయడం విశేషం.

    * ఎక్సైజ్ శాఖ ఆ బాధ్యతలకే పరిమితం
    జగన్ సర్కార్ ఎక్సైజ్ శాఖను కేవలం షాపుల నిర్వహణ బాధ్యతలకు మాత్రమే పరిమితం చేసింది. మద్యం, సారా, గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణ బాధ్యతల కోసం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ప్రకటించింది. వీటి కోసం ఇటువంటి ప్రత్యేక నియామకాలు చేయలేదు. ఎక్సైజ్ శాఖలోని 70 శాతం సిబ్బందిని అటు బదలాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 208 సెబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటికి సొంత భవనాలు లేవు. ఈ స్టేషన్లన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతూ వచ్చాయి. ఇవన్నీ ఇప్పుడు ఎక్సైజ్ శాఖలోకి వెళ్ళనున్నాయి. అధికారులు, సిబ్బంది మాతృ సంస్థలోకి రానున్నారు.

    * గంజాయి, సారా స్వైర విహారం
    గత ఐదేళ్ల కాలంలో వైసిపి మద్యం పాలసీతో నాటు సారా విజృంభించింది. గంజాయి ప్రవాహం అధికంగా ఉండేది. వీటిని నియంత్రించడంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పూర్తిగా విఫలమైంది. సిబ్బంది బదలాయింపుతో ఎక్సైజ్ శాఖ సైతం అచేతనంగా మారింది. అందుకే కూటమి ప్రభుత్వం ఈ లోపాన్ని గుర్తించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై అధ్యయనం చేసింది. ఎక్సైజ్ శాఖను విభజించడంతో అసలు లక్ష్యం దెబ్బతిన్నట్లు గుర్తించింది. అందుకే జగన్ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపడుతూ.. తాజాగా నిర్ణయం తీసుకుంది.

    * ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం
    ఐదేళ్ల వైసిపి పాలనలో ఎక్సైజ్ శాఖ నీరుగారి పోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖలో కొత్త నియామకాలు లేవు. ఉన్న సిబ్బందిని సెబ్ వైపు సర్దుబాటు చేశారు. అటు ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ సక్రమంగా చేయలేదు. ఇటు అక్రమ మద్యం నియంత్రణలోకి రాలేదు. కేవలం వైసీపీ ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం అన్నట్లు సాగింది. అందుకే కూటమి ప్రభుత్వం సెబ్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.