Academic instructors Notification: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. విద్యార్థుల చదువును భవిష్యత్ పెట్టుబడిగా భావిస్తున్నాయి. భారత దేశం ఎక్కువ మంది యువత కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో మానవ వనరులను పెంచుకునే దిశగా ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇక చంద్రబాబు అంటేనే డీఎస్సీ.. డీఎస్సీ అంటేనే చంద్రబాబు అన్న గుర్తింపు ఉమ్మడి రాష్ట్రంలో ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ ప్రకటించి భారీగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశారు. తాజాగా ఉపాధ్యాయులు తక్కువగా ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇన్‌స్ట్రక్టర్ల నియామకం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత సమస్య పరిష్కారానికి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించాలని నిర్ణయించింది. ఇప్పటికే మెగా డీఎస్సీ ద్వారా భర్తీలు జరిగినా, ఇంకా ఖాళీలు మిగిలిపోవడంతో ఈ చర్య చేపట్టింది. విద్యా వాలంటీర్ల మాదిరిగా వీరు బోధనా విధులు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,146 మంది నియామకానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్కూల్ అసిస్టెంట్ స్థాయి ఇన్‌స్ట్రక్టర్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10 వేల చొప్పున వేతనం ఇస్తారు.
తీరనున్న విద్యార్థుల ఇబ్బందులు..
ఇన్‌స్ట్రక్టర్ల నియామకంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుల సమస్యలు తీరనున్నాయి. ఇప్పటికే చాలా పాఠశాలల్లో సిలబస్ పూర్తి కాలేదు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు ఎంతగానో మేలు జరుగనుంది.