AP Deputy CM Pawan Kalyan : సంక్షేమ పథకాల పేర్ల విషయంలో కూటమి ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. గతంలో ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు పేరిట ఎక్కువ పథకాలు అమలు చేసేవారు. ఈసారి ఆ పరిస్థితి లేదు. మూడు పార్టీల కూటమి ప్రభుత్వం నేపథ్యంలో అలా చేస్తామంటే కుదిరే పని కాదు. అందుకే ఎక్కువ పథకాలకు మహనీయుల పేర్లు పెడుతున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సిఫారసులకు పెద్దపీట వేస్తున్నారు.గోదావరి జిల్లాలకు చెందిన డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్నం భోజన పథకం అమలు చేయనున్నారు. జగనన్న గోరుముద్దుగా ఉన్న ఈ పథకం పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మార్చారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అయితే ఎన్టీఆర్, చంద్రన్న పేరుతో ఎక్కువ పథకాలు అమలు చేసేవారు. వైసీపీ అయితే రాజశేఖర్ రెడ్డి, జగనన్న పేరుతో పథకాలు అమలు చేస్తూ వచ్చారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరిట పథకాలు అమలయ్యేవి. కానీ ఈసారి పవన్ ప్రత్యేక కృషితో కూటమి ప్రభుత్వం ఏర్పాటయింది. అందుకే చంద్రబాబు సర్కార్ బాధ్యతగా వ్యవహరిస్తోంది. సంక్షేమ పథకాలకు పేర్ల విషయంలో పవన్ ప్రతిపాదనలకు పెద్దపీట వేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు మూడు పథకాల పేర్లు మార్చింది. తాజాగా విద్యాశాఖకు సంబంధించి పథకాలకు మహనీయుల పేర్లు పెడుతూ మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇందులో పవన్ ప్రతిపాదనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే పథకాలకు మహనీయుల పేర్లు పెట్టడాన్ని పవన్ స్వాగతించారు. మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
* కీలక పథకాలకు పేర్లు మార్పు
ప్రాథమిక విద్యలో అమలైన పథకాలకు ప్రస్తుతం గొప్ప వ్యక్తుల పేర్లు పెట్టారు. జగనన్న అమ్మఒడి పేరును తల్లికి వందనంగా మార్చారు. జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా నామకరణం చేశారు. జగనన్న గోరుముద్ద పథకాన్ని డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనంగా మార్చారు. నాడు నేడు పథకాన్ని మనబడి మన భవిష్యత్తుగా, స్వేచ్ఛ పథకాన్ని బాలికా రక్షగా, జగనన్న ఆణిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేర్లు మార్చారు. అంతకుముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ గా మార్చారు.
* పవన్ సిఫార్సులకు పెద్దపీట
గత ప్రభుత్వాల హయాంలో పథకాల పేర్లు స్థానిక పార్టీల నాయకుల పేర్లతో ఉండేవి. కానీ ఇప్పుడు సమూల మార్పులు కనిపిస్తున్నాయి. మహనీయుల పేర్లు వినిపించడం విశేషం. పవన్ కళ్యాణ్ కు జాతీయవాదం ఎక్కువ. ఎక్కువగా ఇష్టపడతారు కూడా. మోడీపై కూడా అభిమానానికి అదే కారణం. ఇప్పుడు అబ్దుల్ కలాం, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి మహనీయుల పేర్లు పథకాలకు పెడుతుండడం వెనుక పవన్ చొరవ ఉంది.
ఆయన స్ఫూర్తితోనే : లోకేష్
విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ పథకాలకు సంబంధించి పేర్లను వెల్లడించడం పై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. ట్విట్టర్లో అభినందించారు. జాతి కోసం పాటుపడిన పెద్దలు, ప్రముఖుల పేర్లను పెట్టడం ద్వారా స్ఫూర్తిని కలిగించారని కొనియాడారు. దీనిపై నారా లోకేష్ సైతం స్పందించారు. పవన్ అన్న స్ఫూర్తితోనే ఇదంతా అని చెప్పుకొచ్చారు. పవన్ ఆలోచనలను కూడా తాము తీసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. మున్ముందు ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ పథకాలకు దేశ ప్రముఖుల పేర్లు పెట్టడాన్ని సామాన్యులు సైతం ఆహ్వానిస్తున్నారు.
*స్ఫూర్తిప్రదాతల పేర్లతో ప్రభుత్వ పథకాలు హర్షణీయం*
భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ గారు, అబ్దుల్ కలాం గారి…
— Pawan Kalyan (@PawanKalyan) July 28, 2024