AP Government: ఏపీ ప్రభుత్వం( AP government) సినిమా టికెట్ల ధరపై దృష్టి పెట్టింది. గత కొద్ది రోజులుగా ఇది సమస్యగా మిగిలిన సంగతి తెలిసిందే. అందుకే పరిష్కార మార్గం కనుగొనేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ టిక్కెట్ల ధరలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ప్రజలకు అందుబాటు ధరల్లో టికెట్లు ఉండేలా.. నిర్మాతలు నష్టపోకుండా చూడాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. గత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టిందన్న విమర్శను మూటగట్టుకుంది. అందుకే 2024 ఎన్నికల్లో సినీ పరిశ్రమ కూటమి వైపు మొగ్గు చూపింది. అందుకే ఇప్పుడు సినీ పరిశ్రమతో పాటు సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని.. సినిమా టిక్కెట్ ధరలను నిర్ణయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఏ వర్గం నుంచి విమర్శలు రాకుండా చూసుకోవాలని చూస్తోంది. మరి ఈ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో చూడాలి.
Also Read: కాశ్మీర్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఉగ్రవాదులు నవరంద్రాలూ మూసుకోవాల్సిందే!
* వైసీపీ సంచలన నిర్ణయం..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ప్రభుత్వం సినిమా టికెట్ల ధర విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. అప్పట్లో టిక్కెట్ ధరలను తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇలా అయితే చిత్ర పరిశ్రమ బతకదని అప్పట్లో సినీ ప్రముఖులు.. అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అక్కడ కొద్ది రోజులకు టికెట్ ధరపై వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకొని.. అప్పట్లో అటువంటి నిర్ణయాలు తీసుకున్నారన్న విమర్శ ఉంది. ఉద్దేశపూర్వకంగానే సినీ పరిశ్రమను అప్పట్లో ఇబ్బంది పెట్టారని ఆ రంగానికి చెందిన వ్యక్తులు భావించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల విపరీతమైన వ్యతిరేకతను పెంచుకున్నారు. అందుకే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి వైపు మొగ్గు చూపారు. కూటమికి మద్దతుగా ప్రకటనలు చేశారు. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమ నుంచి విజ్ఞప్తులు రావడంతో.. టికెట్ ధరల పెంపు పై అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం.
* ఐదుగురు సభ్యులతో..
రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి( chief secretary Home Affairs department) నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు అయింది. టికెట్ల ధరల గురించి హైకోర్టులో కేసులు నడుస్తుండడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, సమాచార శాఖ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. సినీ నిర్మాత వివేక్ కూచిబొట్ల కూడా ఈ కమిటీలో ఒక సభ్యుడు. టికెట్ల ధర పెంపుపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. చిత్ర పరిశ్రమకు నష్టం కలుగకుండా.. ప్రేక్షకులపై భారం పడకుండా.. అందరికీ ఆమోద యోగ్యమైన నిర్ణయాన్ని తీసుకోనున్నారు.
* అన్ని అంశాలు పరిశీలన..
ప్రస్తుతం థియేటర్లలో( cinema theatres ) టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి? న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనేవి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అటు తరువాత ప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేస్తారు. అలాగే సినిమా టిక్కెట్ల ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉందా? లేదా అనే దానిపై ఈ కమిటీ పరిశీలన చేయనుంది. ప్రజలకు అందుబాటులో ఉండే ధరల్లో టిక్కెట్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్మాతలు, పంపిణీదారులు కూడా నష్టపోకుండా ఉండేలా చూడాలని ప్రభుత్వం యోచిస్తోంది.