AP Famers : రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఖరీఫ్ నకు సంబంధించి వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది కూటమి సర్కార్. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టింది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తోంది. ఏటా ఖరీఫ్ సమయంలో ధాన్యం కొనుగోలు లో అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యేవి. రైతులు నెలల తరబడి ధాన్యం బిల్లుల కోసం ఎదురుచూపులు చూసేవారు. మిల్లర్ల చుట్టూ తిరిగేవారు. కానీ ఈసారి ఆ పరిస్థితి లేకుండా కూటమి సర్కార్.. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేయడం విశేషం.
* గతంలో ఇబ్బందికరమే
గత ఐదేళ్ల వైసిపి పాలనలో ధాన్యం విక్రయించాలంటే అనేక రకాల ఇబ్బందులు ఉండేవి. మిల్లుల వద్ద వాహనాలు బారులు తీరేవి. తేమశాతం పేరిట రైతులకు సవా లక్ష కొర్రీలు పెట్టేవారు. రోజుల తరబడి రైతులు నిరీక్షించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోళ్లపై ముందస్తు చర్యలు చేపట్టింది. రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని భావించింది. రైతు ధాన్యం అందించిన వెంటనే.. గంటల వ్యవధిలో అప్లోడ్ తో పాటు.. విక్రయాలు పూర్తయ్యేలా చేసింది. వెనువెంటనే బిల్లులు చెల్లించేలా ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. అందుకు తగ్గట్టుగానే 48 గంటల్లో నగదు జమ అవుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటనలు
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో.. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. ఒకవైపు రేషన్ బియ్యం అక్రమ దందాతో పాటు.. ఇంకోవైపు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలనిఅధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగానే పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి అధికారులకు కీలక ఆదేశాలు ఇస్తున్నారు.